విపక్షాల ప్రధాని అభ్యర్థి రేసులో నితీష్‌తో పాటు కేసీఆర్‌!

Kommineni Srinivasa Rao Comment On CM KCR National Politics - Sakshi

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన ఎజెండా ప్రకారం ముందుకు వెళుతున్నారు. రోజురోజుకు ఆయన బీజేపీపై విమర్శల ఘాటు పెంచుతున్నారు. తాజాగా ఆయన జాతీయ రాజకీయాలలోకి వెళ్లడం ఖాయమని చెప్పారు. అంతేకాక కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వం వచ్చాక దేశం అంతటా రైతులకు ఉచిత కరెంటు ఇస్తామని ఆయన ప్రకటించారు. యథాప్రకారం బీజేపీపైన, ప్రధాని మోదీపైన విమర్శలు సాగిస్తూ, కేంద్రంలో ప్రభుత్వం మారవలసిన అవశ్యకతను వివరిస్తున్నారు. తెలంగాణలో ఆయా సభలలో ప్రసంగించడం, దేశ వ్యాప్తంగా ఉన్న   రైతు నేతలతో సంప్రదింపులు, దేశంలోని ఇతర ప్రముఖులను కలవడం వంటివి చేస్తున్నారు. అయితే విపక్షాల ప్రధాని అభ్యర్ది ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతోంది.  కేసీఆర్‌ విపక్షాల తరపున ప్రధాని అభ్యర్ధి అయితే గొప్ప సంగతే అవుతుంది.

కేసీఆర్‌ను ఒక వైపు ప్రధాని అభ్యర్దిగా పోకస్ చేయడానికి ఆ పార్టీ నేతలు గట్టి ప్రయత్నం చేస్తుంటే, బీహారు సి.ఎమ్. నితీష్ కుమార్ విపక్షాల ఐక్యత కోసం పర్యటనలు చేయడం ఆరంబించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా కలిశారు. పైకి చెప్పకపోయినా, నితీష్ కుమార్ ను ప్రధాని అభ్యర్దిగా జెడియు ఫోకస్ చేస్తోంది. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న  నితీష్‌ను కలవడానికి కేసీఆర్‌ వెళ్లివచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడినా, వారి  మధ్య వైరుధ్యాలు కనిపించాయి. ఎవరు ప్రధాని అన్న ప్రశ్నకు కేసీఆర్‌ అది అన్ని పార్టీలు కలిసి నిర్ణయిస్తాయని జవాబు ఇచ్చారు. కాగా కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతుండగా, నితీష్ కుమార్ లేచి నిలబడి వెళ్లిపోదామని చెప్పడం కూడా ఒక విశేష పరిణామంగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గాల్వాన్ లో మరణించిన బీహరు అమర సైనికుల కుటుంబాలకు కేసీఆర్‌  తెలంగాణ ప్రభుత్వ పరంగా సాయం అందించారు.

అలాగే సికింద్రాబాద్‌లో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో మరణించిన  ఆ రాష్ట్రానికి చెందిన కార్మికుల కుటుంబాలకు కూడా పరిహారం ఇచ్చారు. ఈ విషయాలు ఆహ్వానించదగినవే. దేశ రక్షణలో అమరులైనవారి కుటుంబాలకు ఎంత చేసినా తప్పు లేదు.  అలాగే ప్రమాద బాధితులను ఆదుకోవడం కూడా మంచిదే. ఇంతవరకు బాగానే ఉన్నా, కేసీఆర్‌ అక్కడ జరిపిన రాజకీయ చర్చలు ఎంతవరకు ఫలప్రదమయ్యాయన్నది చర్చనీయాంశంగా ఉంది. ఆ మొత్తం సన్నివేశాన్ని చూస్తే బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్  జాతీయ రాజకీయాలపై బహిరంగంగా చర్చించడానికి  అంత ఆసక్తికనబరచినట్లు పైకి  కనిపించకుండా జాగ్రత్తపడ్డారనిపిస్తుంది. అదే సమయంలో కేసీఆర్‌ బీజేపీ ముక్త భారత్ అన్న నినాదాన్ని అక్కడ కూడా ఇచ్చి వచ్చారు. కేసీఆర్‌, నితీష్ లు ఇద్దరూ సుదీర్ఘకాలంగా రాజకీయాలలో ఉన్నవారే. కేంద్ర మంత్రిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ అనుభవం పెద్దది. ఆయన రాజకీయాలలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తన పదవిని నిలబెట్టుకుంటున్నారు.

కూటములు మార్చుతారన్నవిమర్శ లేకపోలేదు. అయినా  బీహారు ఉత్తరాది ప్రాంత రాష్ట్రం కావడం, అక్కడ నలభై పార్లమెంటు సీట్లు ఉండడం ఆయనకు కొంత అడ్వాంటేజ్ అని చెప్పాలి. నితీష్ పైకి ప్రధాని పదవి గురించి తాను ఆలోచించడం లేదని చెప్పినా, ఆయన పార్టీ జెడి(యు)నేతలు మాత్రం ఆయనను ప్రధాని అభ్యర్దిగానే పోకస్ చేస్తున్నారు. కేసీఆర్‌ వెళ్లేరోజుకే జెడియు నేతలు పనికట్టుకుని దీనిపై ప్రకటనలు చేశారట. అంటే దాని అర్దం కేసీఆర్‌ సంగతి ఎలా ఉన్నా, నితీష్ ప్రధాని పదవికి అర్హుడని చెప్పడమే అన్న విశ్లేషణలు వచ్చాయి.కాని నితీష్ కు ఒక లిమిటేషన్ ఉంది. తన పార్టీ కన్నా భాగస్వామి పార్టీ అయిన  ఆర్జెడి పెద్దది. అలాగే కాంగ్రెస్ , మరికొన్ని చిన్న పార్టీలతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అంతకుముందు బీజేపీతో కలిపి కూటమి కట్టినా ఆయన అదే పరిస్థితిలో ఉ న్నారు. కాకపోతే నితీష్ వ్యక్తిత్వం , తెలివితేటల కారణంగా సిఎమ్ పదవిలో కొనసాగగలుగుతున్నారు.కేసీఆర్‌ పరిస్థితి వేరు. ఆయన కూడా తొలుత 2004లో  కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా, విడిపోయాక ఆ పార్టీకి దూరం అయ్యారు.

తదుపరి టిడిపి, వామపక్షాలతో  కలిసి కూటమి కట్టి విఫలం అయ్యాక,ఎవరి దారి వారు చూసుకున్నారు.తెలంగాణ వచ్చిన తర్వాత ఒంటరిగా పోటీచేసి విజయం సాదిస్తున్నారు. కాకపోతే ఎమ్.ఐ.ఎమ్.తో పరోక్ష మిత్రతృం నడుపుతున్నారు. తెలంగాణ చిన్న రాష్ట్రం అవడం, కేవలం 17 లోక్ సభ సీట్లే ఉండడం కేసీఆర్‌ కు మైనస్ అని చెప్పాలి. కేసీఆర్‌ దేశ ప్రధాని కావాలని టిఆర్ఎస్ నేతలు పలుమార్లు ప్రకటనలు చేశారు. ఫెడరల్ ఫ్రంట్, భారత రాష్ట్ర సమితి ఆలోచనలు చేసినా, వాటిపై ఆయన ముందుకు వెళ్లలేకపోయారు.ఆ తర్వాత ఆయన దేశ వ్యాప్తంగా రైతు సంఘాల నేతలను హైదరాబాద్ తీసుకువచ్చి, సాగునీటి రంగంలో తన ప్రభుత్వం సాధించిన ప్రగతిని చూపించి, వారితో సంప్రదింపులు జరపడం ద్వారా దేశవ్యాప్త ప్రొజెక్షన్ లోకి వెళ్లారు. అదే సమయంలో ప్రధాని మోదీపైన, బీజేపీపైన ఇటీవలి కాలంలో నిప్పులు చెరుగుతున్నారు. సీబీఐ, ఈడి వంటి సంస్థల తీరుపై ధ్వజమెత్తుతున్నారు.

మత విద్శేషాలు రెచ్చగొట్టే బీజేపీ కావాలా అంటూ పంటలా? మంటలా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. దేశవ్యాప్త అటెన్షన్ పొందడం ఒక ఎత్తు అయితే, వచ్చే ఏడాది జరగబోయే శాసనసభ ఎన్నికలలో విజయం సాదించడానికి కూడా ఈ ఎత్తుగడలన్ని ఉపయోగపడతాయని ఆయన భావిస్తున్నారని అనుకోవచ్చు.ఈ క్రమంలో ప్రధాని అభ్యర్దిగా పోటీలో ఉన్నారంటే సహజంగానే ఇమేజీ పెరుగుతుంది. ప్రజలు ఆయనకు మరింత మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాని అదే సమయంలో నితీష్ కుమార్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటే వీరిద్దరి మద్య పోటీ వస్తే నితీష్ కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పరస్పరం ఈ ఇద్దరు నేతలు ప్రశంసించుకున్నప్పటికీ,ప్రధాని అభ్యర్ధి ఎవరన్నదానిపై అంతా కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ చెప్పడం గమనించవలసిన అంశం. బీజేపీ వ్యతిరేక కూటమి విషయం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఎంతమంది మిత్రులు ఇందుకు కలిసి వస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది.ఒక వేళ కేసీఆర్‌ను నితీష్ లేదా నితీష్ ను కేసీఆర్‌ ప్రధాని అభ్యర్ధి అని చెప్పగలిగి ఉంటే అప్పుడు రాజకీయాలు మరింత ఆసక్తికరం అయి ఉండేవి.

టిఆర్ఎస్ కు రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా ఒక ప్రత్యర్ధి అయితే, నితీష్ కు  ఇబ్బంది లేదు. అయినా ఇతర పార్టీలతో మాట్లాడకుండా ఆ విషయాలపై ప్రకటన చేయలేరు.కాని ఈ ఇద్దరు నేతలకు ప్రధాని పదవిపై దృష్టి ఉందన్నది బహిరంగ రహస్యమే. ఈ నేపధ్యంలోనే కేసీఆర్‌ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు నితీష్ సడన్ గా లేచి మీడియాకు ధన్యవాదాలు అని ముగించే యత్నం చేయడం, కేసీఆర్‌ ఆయనను వారించి , కూర్చోవలసిందిగా కోరిన సీన్ రకరకాల రాజకీయ చర్చలకు దారి తీసింది. ఇది కేసీఆర్‌ కు అప్రతిష్ట అని తెలంగాణలోని బీజేపీ, కాంగ్రెస్ లు వ్యాఖ్యానిస్తుంటే , కేసీఆర్‌ ను పాట్నా విమానాశ్రయానికి వచ్చి నితీష్ ఘన స్వాగతం చెప్పారని, ఇంతకన్నా గౌరవం ఏమి ఉంటుందని టిఆర్ఎస్ ప్రశ్నిస్తోంది.వీరిద్దరిలో ఎవరు ప్రధాని అభ్యర్ది అవుతారన్నదానిపై ఇప్పటికిప్పుడు చెప్పలేం.  అదే సమయంలో మరో కీలక అంశం మర్చిపోకూడదు. నితీష్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామే.నితీష్ కు కలిసి వచ్చే అంశం. అందువల్లే ఆయన రాహుల్ గాంధీతో సహా పలువురిని కలిసి విపక్ష ఐక్యతకు నడుం కట్టారు. కాని కేసీఆర్‌ ఇప్పటికిప్పుడు ఆ పని చేయలేరు.

ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రదాన ప్రత్యర్దిగా ఉంది. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ కూటమిలో లేకుండా బీజేపీ ముక్త్ భారత్ ఎలా సాద్యమన్నదానిపై టిఆర్ఎస్ జవాబు ఇవ్వలేకపోతోంది. తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ పవర్ కోసం పెనుగులాడుతోంది. అయినా డిల్లీ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిలో ఈ రెండు పార్టీలు జతకలవక తప్పకపోవచ్చన్న భావన ఉంది.ఈ అంశాలపై టిఆర్ఎస్‌కు మరింత స్పష్టత అవసరం అవుతుంది. అందువల్లే ఇటీవలికాలంలో కేసీఆర్‌ బీజేపీపైనే ఫోకస్ ఎక్కువ పెట్టి విమర్శలు చేస్తున్నారు.కాంగ్రెస్ జోలికి వెళ్లడం లేదు.  ఇక్కడ మరో విషయం ప్రస్తావించాలి. కేసీఆర్‌ పంజాబ్ వెళ్లి రైతుల ఆందోళనలో పాల్గొని మరణించినవారి కుటుంబాలకు , ఇప్పుడు బీహారు వెళ్లి అమరుల కుటుంబాలకు సాయం చేయడం చూడడానికి బాగానే ఉన్నా, తెలంగాణలో మాత్రం అంత సానుకూలత వస్తున్నట్లు
గా లేదు. తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉంటే వాటిని వదలిపెట్టి ఆయా రాష్ట్రాలకు వెళ్లి డబ్బులు ఇచ్చి రావడం ఏమిటన్న విమర్శను టిఆర్ఎస్ ఎదుర్కుంటోంది.

అదే సమయంలో హైదరాబాద్ సమీపంలోని ఇబ్రహింపట్నం వద్ద ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు అపసవ్యంగా జరిగి నలుగురు మరణించిన ఘటన ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. ఇక్కడి మృతులకు పాతిక లక్షలు ఇవ్వాలని లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్, పిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డిలు బాదిత కుటుంబాలను కలిసి సానుభూతి తెలిపారు. ఆ సందర్భంగా కెసిఆర పై విమర్శల వర్షం కురిపించారు. ఏది ఏమైనా కేసీఆర్‌ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నేతలను కలవడం ద్వారా  బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారన్న భావన కల్పించడం వరకు సఫలం అయ్యారు. ప్రాంతీయ పార్టీలకు ఉండే సహజ పరిమితులను అదిగమించి ఈ మాత్రం అయినా దేశ వ్యాప్త ఫోకస్ పొందగలగడం వరకు కేసీఆర్‌ కు గొప్ప విషయమే కావచ్చు.గతంలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు  ఎన్.టి.రామారావు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నేషనల్ ప్రంట్ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ ప్రంట్ కు ఆయన చైర్మన్ అయ్యారు. ఆయనను కూడా దేశ ప్రధాని అభ్యర్ది అన్న భావన వచ్చింది.

కానీ 1989లో ఆయన ప్రభుత్వం ఓడిపోవడంతో రాజకీయంగా వెనుకబడ్డారు. ఆ తర్వాత కాలంలో ఎన్.టి.ఆర్.ను పదవిచ్యుతుడిని చేసిన చంద్రబాబు అప్పట్లో బీజేపీయేతర పక్షాలకు ప్రత్యామ్నాయంగా  రూపొందింన యునైటెడ్ ప్రంట్ లో చేరి దానికి కన్వీనర్ అయ్యారు. బయటనుంచి కాంగ్రెస్ మద్దతు తీసుకుని ఆ ప్రంట్ ప్రభుత్వం ఏర్పడినా,ఎక్కువకాలం నిలబడలేకపోయింది. ఆ తర్వాత చంద్రబాబునాయుడు ఎన్‌డీఏలోకి జంప్ చేశారు. తాజాగా కేసీఆర్‌ కొత్త కూటమిని తయారు చేసే పనిలో క్రియాశీలకంగా ఉన్నారు.  బీజేపీ, కాంగ్రెస్ లు  రెండూ లేని రాజకీయ ప్రంట్ ఏర్పాటు ప్రస్తుతం సాద్యమయ్యే పరిస్థితిలేదు. అయినా కేసీఆర్‌ ఈ విషయంలో ఎలా ముందుకు వెళతారన్నది ఆసక్తికరమైన ప్రశ్నగానే ఉంది. ప్రతిపక్షాలు ప్రధాని అభ్యర్ది పేరును ఖరారు చేసుకోకుండా ఎన్నికల రంగంలో దూకినా అంత క్రెడిబిలిటి రాదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని కాండిడేట్ అని ఆ పార్టీ చెబుతుందా?లేదా అన్నది ఇంకా తేలలేదు. ఈ లోగా కేసీఆర్‌, నితీష్‌లు రంగంలోకి వచ్చారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వంటివారు ప్రస్తుతం మాట్లాడకపోయినా, ఆ రేసులో ఉంటారు. విపక్షాల కాండిడేట్ ప్రధాని మోదీకి దీటైన అభ్యర్ధి  అన్న భావన వస్తేనే దేశం రాజకీయ వాతావరణం కొంత మారుతుంది. ఇవన్ని ఒక కొలిక్కి రావల్సి ఉంది.  ముందుగా ఇంట మరోసారి గెలిచి, ఆ తర్వాత రచ్చకెక్కితేనే కేసీఆర్‌ కు మరింత ప్రాధాన్యత వస్తుందన్నది వాస్తవం. 

-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top