
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. సర్వేలు, పనితీరు ఆధారంగానే టికెట్లు దక్కుతాయన్న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో.. సిట్టింగ్‌ల టికెట్లలో భారీ కోత ఉంటుందని, ఆ స్థానంలో తమకు అవకాశం రావొచ్చని ఆశావహులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్ తదితర ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ విజ్ఞప్తిని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నవారిలో.. మంత్రి సత్యవతి రాథోడ్ సహా డజను మందికిపైగా ఎమ్మెల్సీలు, సుమారు అరడజను మంది ఎంపీలు, మరో పది మంది దాకా ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు.
రంగంలోకి ఎందరో..
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ గతంలో డోర్నకల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. వచ్చే ఎన్నికల్లో డోర్నకల్, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో ఏదో ఒకచోటి నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు.
మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కూడా గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన మహబూబాబాద్ అసెంబ్లీ స్థానంలో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇలా మంత్రి సత్యవతి, ఎంపీ కవిత ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తుండటంతో డోర్నకల్, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు రాజుకుంటున్నాయి.
మరోవైపు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నాగర్‌కర్నూల్ ఎంపీ పి. రాములు (అచ్చంపేట), 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీచేసి ఓటమి పాలైన నామా నాగేశ్వర్‌రావు (ఖమ్మం), బోర్లకుంట వెంకటేశ్ (చెన్నూరు), రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (వరంగల్ తూర్పు) కూడా అవకాశం చిక్కితే అసెంబ్లీలో అడుగు పెట్టడంపై ఆసక్తి చూపుతున్నారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఏదో ఒక సెగ్మెంట్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలో ఉన్నట్టు బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి.
అసెంబ్లీ వైపు ఎమ్మెల్సీల చూపు
శాసన మండలిలో సుమారు మూడో వంతు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు అవకాశం దక్కితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. వారిలో కొందరు గతంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కూడా పనిచేసినవారే కావడంతో టికెట్ దక్కించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న కల్వకుంట్ల కవిత, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే బరిలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
కవిత నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని బాల్కొండ లేదా జగిత్యాల నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన కుమారుడు అమిత్‌రెడ్డిని నల్గొండ లేదా మునుగోడు నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. మరో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కూడా తన కుమారుడిని నాగర్‌కర్నూల్ నుంచి ఆరంగేట్రం చేయించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
తాజాగా కూచుకుళ్ల కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంపై బీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు (కుత్బుల్లాపూర్), కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (జనగామ), మంకెన కోటిరెడ్డి (నాగార్జునసాగర్), పి.వెంకట్రామిరెడ్డి (సంగారెడ్డి), శేరి సుభాష్‌రెడ్డి (మెదక్) కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం కేసీఆర్ దృష్టిలో పడే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఇప్పటికే హుజూరాబాద్‌లో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నారు.
కార్పొరేషన్ల చైర్మన్లు కూడా..
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన పలువురు విద్యార్థి, యువజన నేతలు.. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లుగా నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు. వారిలో కొందరు నేతలు ఇప్పటికే తాము ఎంచుకున్న అసెంబ్లీ స్థానాలపై దృష్టి కేంద్రీకరించారు. కేటీఆర్, హరీశ్‌రావు వంటి ముఖ్య నేతల వద్ద తమ మనోగతాన్ని బయట పెడుతున్నారు. టీఎస్‌ఎండీసీ చైర్మన్ మన్నె క్రిషాంక్ సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఇప్పటికే ప్రచార హడావుడి చేస్తున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ (జహీరాబాద్), సాయిచంద్ (అలంపూర్), పల్లె రవికుమార్ (మునుగోడు), ఈడిగ ఆంజనేయగౌడ్ (గద్వాల)తో పాటు దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాజీవ్‌సాగర్, వై.సతీశ్‌రెడ్డి తదితరులు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అరంగేట్రానికి ఆసక్తి చూపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా మంత్రి కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో ఉప్పల్ టికెట్ తనకు దక్కుతుందనే ధీమాతో ఉన్నారు.
సిట్టింగ్‌లలో అసహనం
ఇప్పటికే ఏదో ఒక అధికార పదవిని అనుభవిస్తున్న నేతలు ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తూ ప్రయత్నాలు సాగిస్తుండటంపై ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ స్థానానికి ఎక్కడ ఎసరు వస్తుందోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా పార్టీలో ఎమ్మెల్యే టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో.. పార్టీ అధినేత కేసీఆర్ ఎలా పరిష్కరిస్తారనే దానిపై బీఆర్‌ఎస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు బీఆర్‌ఎస్ టికెట్ దక్కదని అనుమానిస్తున్న పలువురు ఆశావహులు ఇతర పార్టీల్లోనూ తమ అవకాశాలను బేరీజు వేసుకుంటున్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.