
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ(శుక్రవారం) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమా వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌గా కాసేపు ఎపిసోడ్ నడిచింది. పవన్ పేషీపై బోండా సంచలన ఆరోపణలకు దిగగా.. వాటిని పవన్ తోసిపుచ్చారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పీ కృష్ణయ్యపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన ఆరోపణలకు దిగారు. ‘‘ఏదైనా పనిపై ఎమ్మెల్యేలు లెటర్లు పంపితే 30, 40 సంవత్సరాల నుంచి ఇలాంటి ఎమ్మెల్యేలను చాలా మందిని చూశామని కృష్ణయ్య అంటున్నారు. కానీ, ఎమ్మెల్యేలు గెలిస్తేనే కృష్ణయ్య అక్కడ చైర్మన్ అయ్యారని గుర్తు పెట్టుకోవాలి. కృష్ణయ్య దగ్గరకు వెళ్తే.. పవన్ కల్యాణ్‌కు చెప్పాలి.. కానీ ఆయన కలవడం లేదని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కృష్ణయ్య లాంటి వాళ్లను సరిదిద్దాలి అని అన్నారు. అయితే..
ఈ ఆరోపణలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. ‘‘నేను అందుబాటులో ఉండడం లేదన్న వ్యాఖ్యలు సరిదిద్దుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సాధారణంగా ప్రజలతో కంటే పరిశ్రమలతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటుంది. కానీ కృష్ణయ్య చైర్మన్ అయ్యాకే ప్రజల అనుమానాలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. పారిశ్రామిక వేత్తలను భయపెట్టే విధంగా చర్యలు ఉండకూడదు. పర్యావరణాన్ని పరిరక్షించే నిధులు కూడా ప్రభుత్వం వద్ద లేవు. అందరం కలిసి కలెక్టివ్‌గా చేయాల్సిన బాధ్యతలు ఇవి అని పవన్ వివరణ ఇచ్చారు. ఆ సమయంలో అధికారుల గ్యాలరీలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పీ కృష్ణయ్య ఉండడం గమనార్హం.
