విజయ్‌ పొత్తు ఎవరితో? | Congress to support Vijay TVK to form secular government | Sakshi
Sakshi News home page

విజయ్‌ పొత్తు ఎవరితో?

May 6 2026 3:47 AM | Updated on May 6 2026 3:47 AM

Congress to support Vijay TVK to form secular government

మెజారిటీ మార్క్‌కు అడుగుదూరంలో ఆగిన హీరో 

ఆసక్తి కనబరుస్తున్న కాంగ్రెస్‌ ! 

ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్‌కు టీవీకే లేఖ 

అసెంబ్లీ బలనిరూపణకు 2 వారాల గడువు కోరిన పార్టీ 

కొత్త ఎమ్మెల్యేలతో సమావేశమైన విజయ్‌

సాక్షి, చెన్నై: ద్రవిడ రాజకీయాలను మట్టికరిపిస్తూ జనం మద్దతుతో ప్రభంజనంలా దూసుకొచ్చిన యువనేత, టీవీకే చీఫ్‌ విజయ్‌ తమిళనాట నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అడుగుదూరంలో ఆగిపోయారు. మరో పది మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. భావసారూప్య పార్టీలతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఫోన్‌చేసి ప్రత్యేకంగా విజయ్‌ను అభినందించిన నేపథ్యంలో పొత్తుకు కాంగ్రెస్‌ ఆసక్తి కనబరుస్తోందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. వీటిని టీవీకే పార్టీ కొట్టిపారేయలేదు. దీంతో విజయ్‌ ఏ పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్నారనే ఉత్కంఠ మరింత ఎక్కువైంది.

వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్‌కు టీవీకే పార్టీ అధికారికంగా ఈ–మెయిల్‌లో లేఖ పంపింది. తమకు ఇప్పటికే 108 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, రెండు వారాల గడువు ఇస్తే ఆలోపు మరో 12 మంది బయటి ఎమ్మెల్యేల మద్దతుతో శాసనసభలో బలనిరూపణకు సిద్ధమని ఆ లేఖలో పార్టీ పేర్కొంది. లేఖపై గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీవీకే పార్టీకి గవర్నర్‌ రెండు ఆప్షన్లు ఇచ్చే వీలుంది.

అసెంబ్లీ బలనిరూపణ చేసుకోవాలని టీవీకే చీఫ్‌కు గవర్నర్‌ సమన్లు జారీచేయొచ్చు లేదా భాగస్వామ్య పార్టీల తనకుందని నిరూపించుకుంటూ అధికారిక లేఖను సమర్పించాలని కోరవచ్చు. 118 సీట్లకంటే అధిక మెజారీటి తనకుందని విజయ్‌ నిరూపించునే పక్షంలో ప్రభుత్వ ఏర్పాటుకు తక్షణం విజయ్‌ను గవర్నర్‌ ఆహ్వానించే ఆస్కారముంది. ‘‘బయటి ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్‌ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. మరో 6 నెలల తర్వాత కూడా విజయ్‌ తన బలాన్ని నిరూపించుకోవాల్సిరావొచ్చు’’అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.  

చిన్న పార్టీలు కలిసొస్తాయా? 
విజయ్‌ రెండు చోట్ల పోటీచేసిన కారణంగా ఒక స్థానంలో రాజీనామాచేయాల్సిందే. దాంతో ఇప్పుడున్న టీవీకే ఎమ్మెల్యేల సంఖ్య 108 నుంచి 107కు తగ్గుతుంది. టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గంసుగమం అయితే ఈ 107లోనే ఒకరు అసెంబ్లీ స్పీకర్‌ అవుతారు. అప్పుడు ఆయన బలనిరూపణ వేళ ఓటు వేయడం కుదరదు. దీంతో టీవీకే బలం 106కు తగ్గుతుంది. దీంతో బలనిరూపణ వేళ సాధారణ మెజారిటీ కోసం టీవీకేకు కనీసం మరో 12 మంది సభ్యుల మద్దతు అవసరం. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే), దేశీయ మూర్పొక్కు ద్రవిడ కళగం, బీజేపీ తలో స్థానంలో గెలిచాయి. సీపీఐ(ఎం), విదుథలై చిరుతైగల్‌ కట్చి, సీపీఐ, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ పార్టీలు తలో రెండు చోట్ల గెలిచాయి. పట్టాలి మక్కల్‌ కట్చి(పీఎంకే) నాలుగు చోట్ల, కాంగ్రెస్‌ ఐదు చోట్ల గెలిచింది.

ఈ తొమ్మిది పార్టీల్లో కొన్నింటితో కచ్చితంగా పొత్తు పెట్టుకుని అదనంగా 12 మంది సభ్యుల మద్దతును విజయ్‌ సాధించాల్సిందే. నేడు గవర్నర్‌ అర్లేకర్‌ను కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని టీవీకే చీఫ్‌ కోరనున్నారని తెలుస్తోంది. మద్దతుగా తన కొత్త ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్లనున్నారని సమాచారం. గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఖరారు విషయంపై ఇంకా స్పష్టతరాలేదు. మరోవైపు పనయూర్‌లోని విజయ్‌ ఇంటి వద్ద తమిళపోలీసులు భద్రతను పెంచారు. తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూర్‌లలో విజయ్‌ పోటీచేసి రెండుచోట్ల నెగ్గారు. అయితే తిరుచిరాపల్లి ఈస్ట్‌స్థానంలో విజయ్‌ రాజీనామా సమర్పించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. చెన్నైలోని పెరంబర్‌ నుంచే విజయ్‌ ఎమ్మెల్యే కొనసాగే ఛాన్సుంది.  

టీవీకే శాసన సభాపక్ష నేతగా విజయ్‌ 
విజయ్‌ మంగళవారం కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో పార్టీ కార్యాలయంలో సమావేశమై పార్టీ తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా విజయ్‌ను టీవీకే శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు. తర్వాత పార్టీ సైద్ధాంతిక నేతలకు విజయ్‌ నివాళులర్పించారు. పెరియార్‌ ఈవీ రామస్వామి, బీఆర్‌ అంబేడ్కర్, కె.కామరాజ్, వేళు నచియార్, అంజలాయ్‌ అమ్మళ్‌లకు విజయ్‌ నివాళులర్పించారు. ‘‘234 మంది సభ్యులుండే అసెంబ్లీలో 118 మంది మద్దతుతో మేం బలనిరూపణలో విజయం సాధించబోతున్నాం’’అని సమావేశం తర్వాత టీవీకే నేత నంజిల్‌ సంపత్‌ ధీమా వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలను చెన్నై ఈసీఆర్‌లోని ఓ రిసార్టుకు తరలించారు.  

జీవితాంతం రుణపడి ఉంటా: విజయ్‌ 
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో విజయం సాధించిన సినీ నటుడు, టీవీకే చీఫ్‌ విజయ్‌ మంగళవారం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడులోని చిన్నవారు, యువకులు, పెద్దలు అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఆయన ఎక్స్‌లో మంగళవారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి తనను హేళన చేసిన వారు, చులకనగా చూసిన వారికి ప్రజలే గట్టిగా ఎన్నికల ఫలితాల రూపంలో బుద్ధి చెప్పారన్నారు. విమర్శలు, ఒడిదొడుకులు ఎన్నో ఎదురైనా, ముసుగేసుకుని కొందరు విమర్శలు చేసినా, ప్రజలు ఇచ్చిన భరోసా జీవితాంతం గుర్తుండి పోతుందని, అందుకే వారికి జీవిత కాలం రుణపడి ఉంటానని పేర్కొన్నారు.  

విజయ్‌ మా మద్దతు కోరారు:  కాంగ్రెస్‌
న్యూఢిల్లీ: తమిళనాడు ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించినప్పటికీ సాధారణ మెజార్టీ కాస్తంత దూరంలో ఆగిపోయిన టీవీకే పార్టీ భావసారూప్య పార్టీల మద్దతు కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో టీవీకే చీఫ్‌ విజయ్‌ తమను సంప్రదించారని కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం రాత్రి ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌ ఢిల్లీలో మాట్లాడారు. ‘‘తమిళనాడులో ప్రభు త్వ ఏర్పాటుకు మద్దతు కోరుతూ విజయ్‌ మమ్మల్ని విజ్ఞప్తి చేశారు. బీజేపీ, దాని మిత్రపక్షాలు ఎట్టిపరిస్థితుల్లోనూ తమిళనాడులో అధికారం చేజిక్కించుకునేందుకు అవకాశం ఇవ్వబోం.

విజయ్‌ అభ్యర్థన మేరకు, తమిళ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్‌ రాష్ట్ర విభాగానికి మేం దిశానిర్దేశం చేశాం. తమిళ ఓటర్ల సెంటిమెంట్‌కు విలువ ఇస్తూ స్వీయనిర్ణయం తీసుకోవాలని టీఎన్‌పీసీసీకి సలహాలు, సూచనలు ఇచ్చాం’’అని మీడియాతో కేసీ వేణుగోపాల్‌ చెప్పారు. 234 సీట్లున్న తమిళనాడులో విజయ్‌ పార్టీ 108 చోట్ల గెలిచింది. టీవీకేకు కనీసం 12 మంది ఎమ్మెల్యేల అదనపు మద్దతు అవసరం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఐదు చోట్ల గెల్చింది. పట్టాలి మక్కల్‌ కట్చి మరో నాలుగోచోట్ల, సీపీఐ, సీపీఎం చెరో రెండు చోట్ల గెలిచాయి.ఈ నాలుగు పార్టీల మద్దతుతో అంటే ఈ పార్టీల 13 మంది ఎమ్మెల్యేల మద్దతులో విజయ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని వార్తలొచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement