KCR Delhi Tour: యాదాద్రికి రండి..ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ ఆహ్వానం 

CM KCR Meets With PM Narendra Modi In New Delhi - Sakshi

ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ ఆహ్వానం 

అక్టోబర్, నవంబర్‌ మధ్య కార్యక్రమం ఉంటుందని వెల్లడి 

హాజరవుతానని చెప్పిన ప్రధానమంత్రి 

రాష్ట్రానికి సంబంధించి పది అంశాలపై వినతిపత్రాలు ఇచ్చిన సీఎం 

రహదారులు, పరిశ్రమలు, విద్యా సంస్థల ఏర్పాటు కోసం విజ్ఞప్తులు 

ఢిల్లీలోని ప్రధాని నివాసంలో 50 నిమిషాలపాటు చర్చలు

సాక్షి, న్యూఢిల్లీ:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మాణం చేపట్టిన యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌ నెలల మధ్య మంచి ముహూర్తం చేసుకుని ప్రారంభోత్సవం చేపడతామని.. ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌.. శుక్రవారం సాయంత్రం ప్రధానితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు వారు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో పాలన, అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి పలు అంశాలను పరిష్కరించాలని ప్రధానికి సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి తగిన సాయం చేయాలని కోరుతూ.. పది అంశాలతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. భేటీ అనంతరం సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సీఎం హామీలపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని తెలిపింది. మరోవైపు ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయం కూడా కేసీఆర్, మోదీ సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. భేటీ చిత్రాలను ట్వీట్‌ చేసింది. 
 
ఐపీఎస్‌ క్యాడర్‌ సంఖ్య పెంచండి.. 
తెలంగాణ ఏర్పాటయ్యాక పాలన అవసరాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ఉమ్మడి రాష్ట్రం నాటి జోనల్‌ వ్యవస్థ కారణంగా స్థానికులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు.. 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించుకున్నాం. కొత్త జిల్లాలను కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. రాష్ట్రంలో తొమ్మిది పోలీసు జిల్లాలు, రెండు పోలీసు కమిషనరేట్ల స్థానంలో.. 20 పోలీసు జిల్లాలు, 9 పోలీసు కమిషనరేట్లు ఏర్పాటయ్యాయి. దీనికి అనుగుణంగా కొత్త జిల్లాలకు, కొత్త జోన్లకు, కొత్త మల్టీజోన్లకు పోలీస్‌ ఉన్నతాధికారులను నియమించాల్సి ఉంది. అందువల్ల కనీసం 29 సీనియర్‌ డ్యూటీ పోస్టులు ఇస్తూ ప్రస్తుతమున్న 76 సీనియర్‌ డ్యూటీ పోస్టులను 105కు పెంచాలి. మొత్తంగా 139 మందిగా ఉన్న ఐపీఎస్‌ క్యాడర్‌ సంఖ్యను 195కి పెంచాలి. పోలీసు పరిపాలన అవసరాల రీత్యా దీనిని ప్రత్యేక అంశంగా, అసాధారణ కేసుగా పరిగణించి ఆమోదించాలి. 
 
రెండు పారిశ్రామిక కారిడార్లు 
హైదరాబాద్‌– నాగపూర్, వరంగల్‌– హైదరాబాద్‌ పారిశ్రామిక కారిడార్లను మంజూరు చేయాలి. నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా బలమైన ఆర్థిక పునాదిని సృష్టించడం, దీర్ఘకాలిక ప్రాజెక్టులతో ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశా>ం. ఢిల్లీ– ముంబై కారిడార్‌ తరహాలో హైదరాబాద్‌– నాగ్‌పూర్‌ మధ్య 585 కిలోమీటర్ల పొడవున పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలి. కీలక ఐటీ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌ను, మల్టీమోడల్‌ ఇంటర్నేషనల్‌ కార్గో హబ్‌గా ప్రతిపాదించిన నాగ్‌పూర్‌ను ఉపయోగించుకొనే అవకాశం ఉంటుంది. ఈ రెండు నగరాల మధ్య రైల్వే, ఎక్స్‌ప్రెస్‌ హైవే అనుసంధానం ఉంది. ఇది పారిశ్రామిక కారిడార్‌కు తోడ్పడుతుంది. కారిడార్‌తో రోడ్డు, రైలు మార్గాలకు ఇరువైపులా 50 కిలోమీటర్ల వెడల్పున తక్షణ ప్రభావం కనిపిస్తుంది. తెలంగాణ, మహారాష్ట్రల పరిధిలోని జనాభాలో 27 శాతం అంటే 4 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. 

ఇదే తరహాలో వరంగల్‌–హైదరాబాద్‌ పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయడంపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. నాగ్‌పూర్‌–హైదరాబాద్‌ రైలు మార్గం వరంగల్‌ వరకు ఉంది. జాతీయ రహదారి కూడా హైదరాబాద్‌ నుంచి భూపాలపట్నం వరకు అనుసంధానమై ఉంది. ఇవి కారిడార్‌కు తోడ్పడుతాయి. 
 
ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు స్థలం 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాలకు ఢిల్లీలో అధికారిక భవనాలు ఉన్నట్టుగానే తెలంగాణకు కూడా ప్రత్యేక అధికారిక భవనం నిర్మించాల్సి ఉంది. ‘తెలంగాణ భవన్‌’ పేరిట భవనం నిర్మించుకునేందుకు ఢిల్లీలో అనువైన చోట స్థలం కేటాయించాలి. 
 
సడక్‌ యోజన కింద అదనపు నిధులు 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014, సెక్షన్‌ 9, షెడ్యూల్‌ 13 ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల్లో రహదారుల అనుసంధానాన్ని మెరుగుపరచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని రహదారుల అంశం తమ పరిధిలోకి రాదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ చెబుతోంది. అందువల్ల తెలంగాణలో గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై)’ పథకం కింద అదనంగా నిధులు ఇవ్వాలి. నాలుగు వేల కిలోమీటర్ల రహదారులను మంజూరు చేయాలి. వీటి నిర్మాణాన్ని 3.75 మీటర్ల వెడల్పుతో కాకుండా.. 5.5 మీటర్లతో చేపట్టాలి. 
 
మావోయిస్టు ప్రాంతాల్లో రోడ్లు 
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలతో బయటి ప్రాంతాల అనుసంధానాన్ని (కనెక్టివిటీని) పెంచేలా కేంద్రం చేపట్టిన రహదారుల నిర్మాణం భద్రతా దళాలకు ఉపయోగకరం. ఆయా ప్రాంతాల అభివృద్ధికి కూడా చాలా కీలకం. ప్రస్తుతం నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో రహదారి పనులకు కేంద్రం, రాష్ట్రం 60ః40 నిష్పత్తిలో నిధులు భరిస్తున్నాయి. జాతీయ భద్రత దృష్ట్యా మొత్తం 100 శాతం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలి. 
 
కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ 
తెలంగాణలో ప్రధాన నగరాలకు నాణ్యమైన సాంకేతిక విద్యను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా కరీంనగర్‌లో పీపీపీ మోడల్‌లో ట్రిపుల్‌ ఐటీని స్థాపించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌ నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్‌ ఉత్తర తెలంగాణలోని ప్రధాన విద్యా కేంద్రాల్లో ఒకటి. అందువల్ల ట్రిపుల్‌ ఐటీని త్వరగా మంజూరు చేయాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభించేలా ఉత్తర్వులు జారీ చేయాలి. ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన భూమిని, పీపీపీ విధానంలో కావాల్సిన నిధుల వాటాను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఐటీ కంపెనీలు ఇందులో భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహిస్తాం. 
 
గిరిజన సెంట్రల్‌ యూనివర్సిటీ 
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014, సెక్షన్‌ 94లోని షెడ్యూల్‌ 13(3) ప్రకారం తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ములుగు మండలం జాకారంలో 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. విభజన చట్టం స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకుని గిరిజన విశ్వవిద్యాలయాన్ని సెంట్రల్‌ యూనివర్సిటీగా ఏర్పాటు చేయాలి. దీనికి కేంద్రం నుంచి త్వరగా నిధులు ఇవ్వాలి. విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకొనేలా కేంద్ర విద్యా శాఖను ఆదేశించాలి. 

హైదరాబాద్‌లో ఐఐఎం 
ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌) ఉండాలనే ప్రణాళికలో భాగంగా కేంద్రం గత పదేళ్లలో వివిధ రాష్ట్రాల్లో కొత్త ఐఐఎంలను మంజూరు చేసింది. కానీ హైదరాబాద్‌లో ఐఎస్‌బీ (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌) ఉందన్న కారణంతో తెలంగాణకు మాత్రం కేటాయించలేదు. ఐఎస్‌బీలో భారీ ఫీజుల కారణంగా సాధారణ విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదు. అందువల్ల హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలి. దీనికి అవసరమైన భూమిని హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ ప్రాంగణంలో అందుబాటులో ఉంది. 
 
వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌కు రూ.1,000 కోట్లు 
టెక్స్‌టైల్‌ రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు వరంగల్‌ సమీపంలో 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ‘ఇంటిగ్రేటెడ్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌’ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వెయ్యి ఎకరాలు సేకరించాం. అయితే పార్క్‌లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1,600 కోట్లు అవసరమని నిపుణులు అంచనా వేశారు. రాష్ట్ర అవసరాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రం ఈ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లను గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా మంజూరు చేయాలి. దేశంలో పత్తి ఉత్పత్తలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. నైపుణ్యమున్న కార్మికులు, ముడిసరుకు లభ్యత వల్ల టెక్స్‌టైల్‌ రంగం వృద్ధికి అపారమైన అవకాశం ఉంది. దీనికి కేంద్రం తోడ్పాటు ఇవ్వాలి. 

కొత్తగా 21 నవోదయ విద్యాలయాలు 
కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం.. ప్రతి జిల్లాలో ఒక జవహర్‌ నవోదయ విద్యాలయం ఉండాలి. రాష్ట్రంలో ప్రస్తుతం రంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, వరంగల్‌(అర్బన్‌), నాగర్‌ కర్నూల్, నల్గొండ, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లోనే నవోదయ విద్యాలయాలు ఉన్నాయన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ (రూరల్‌), జనగాం, మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, వికారాబాద్, మేడ్చల్‌– మల్కాజిగిరి గ్రామీణ జిల్లాల్లో జవహర్‌ నవోదయ విద్యాలయాలు మంజూరు కావాల్సి ఉంది. గ్రామీణ పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉపయోగపడే ఈ 21 నవోదయ విద్యాలయాలను వెంటనే మంజూరు చేయాలి. వీటికోసం అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.  

ప్రధానికి సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తులివీ...

1. తెలంగాణలో ఐపీఎస్‌ల సంఖ్యను 139 నుంచి 195కి పెంచండి. 
2. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికారిక భవనం కోసం స్థలం కేటాయించండి. 
3. హైదరాబాద్‌– నాగ్‌పూర్, వరంగల్‌– హైదరాబాద్‌ పారిశ్రామిక కారిడార్లను మంజూరు చేయండి.
4. గ్రామీణ సడక్‌ యోజన కింద అదనపు నిధులివ్వండి. 
5. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 100 శాతం కేంద్ర నిధులతో రోడ్లు నిర్మించండి. 
6. కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేయండి.
7. గిరిజన సెంట్రల్‌ యూనివర్సిటీ మంజూరు చేయండి. 
8. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయండి. 
9. వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధికి రూ.1,000 కోట్లు ఇవ్వండి.
10. కొత్తగా 21 జవహర్‌ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయండి. 

చదవండి: KCR Delhi Tour: టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top