ఏలూరు బాధితుల్ని సీఎం పరామర్శిస్తే పెళ్లికి వెళ్లారంటారా! | Chelluboina Venu Comments On Chandrababu And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

ఏలూరు బాధితుల్ని సీఎం పరామర్శిస్తే పెళ్లికి వెళ్లారంటారా!

Dec 9 2020 5:10 AM | Updated on Dec 9 2020 5:10 AM

Chelluboina Venu Comments On Chandrababu And Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): అంతుచిక్కని వ్యాధి ఏలూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే ఏలూరు వెళ్లి బాధితులను పరామర్శించి, అధికారులతో సమీక్ష నిర్వహించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గుర్తు చేశారు. ఏలూరు ఘటనపై సీఎం అప్రమత్తమై అనుక్షణం పరిస్థితిని సమీక్షిస్తుంటే.. ప్రతిపక్షనేత చంద్రబాబు పెళ్లిళ్లు, పేరంటాళ్లు అని మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మంత్రి మాట్లాడారు. సీఎం ఏలూరు వెళ్లిన తరువాతే వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ కూడా ప్రత్యేక బృందాన్ని పంపించి అధ్యయనం చేసిందన్నారు. బాబు ఇల్లు కదలడు.. పవన్‌ కళ్యాణ్‌ ఫాం హౌస్‌ వదలడని విమర్శించారు.

ఏలూరులో వందల మంది అంతుచిక్కని వ్యాధితో భయభ్రాంతులకు గురైనా, విశాఖలో పాలిమర్స్‌ కాలుష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడినా చంద్రబాబు హైదరాబాద్‌ను వదల్లేదన్నారు. కనీసం బాధితులను పరామర్శించాలన్న ఆలోచన కూడా ఆయనకు లేదని, సీఎం జగన్‌ పరామర్శిస్తే దానిని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఇంట్లో వివాహ కార్యక్రమం ఉన్నా.. సీఎం జగన్‌కు ప్రజలు ముఖ్యం గనుక హుటాహుటిన ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి  బాధితులను పరామర్శించి భరోసా కల్పించారని తెలిపారు. వాస్తవాలను వదిలేసి చంద్రబాబు దీనిని కూడా రాజకీయం చేయటం దురదృష్టకరమన్నారు. చంద్రబాబుకు తాబేదారుగా మారిన పవన్‌ కల్యాణ్‌ ఇల్లు కాదు కదా, బెడ్‌ రూమ్‌ కూడా వదలడని.. అక్కడే ఫ్యాన్సీ డ్రెస్‌ వేసుకుని సినిమా సెట్టింగ్‌లో ఫొటో తీయించుకుని రైతుల కోసం దీక్ష చేశానంటారని విమర్శించారు. 

నిజాలు ఏనాడూ రాయని ఈనాడు
ప్రభుత్వంపై నిత్యం ఏదో విధంగా బురద చల్లటం, ప్రజలను ఏ విధంగానైనా తప్పుదారి పట్టించాలన్నదే ఈనాడు పత్రిక అజెండా అని మంత్రి ధ్వజమెత్తారు. బాబు పాలనలో ఎప్పుడు చూసినా కరువు కాటకాలే, ఎక్కడ చూసినా దుర్భిక్షం, క్షామం విలయతాండవం చేశాయన్నారు. ఈనాడు పత్రికలో నివర్‌ తుపాను, వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన పంట నష్టంపై తప్పుడు లెక్కలతో, పొంతన లేకుండా పంట నష్టం అంచనాలను పెంచుకుంటూ పోయారని తెలిపారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలన.. సీఎం జగన్‌ 18 నెలల పాలనలో రైతులకు ఏమిచ్చారో రాయడానికి ఈనాడుకు ధైర్యం చాలడం లేదు ఎందుకని ప్రశ్నించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement