స్వచ్ఛత శూన్యం.. స్పష్టత కరువు: హరీశ్‌రావు | BRS Leader Harish Rao Fires On Congress Govt | Sakshi
Sakshi News home page

స్వచ్ఛత శూన్యం.. స్పష్టత కరువు: హరీశ్‌రావు

Mar 24 2026 1:51 AM | Updated on Mar 24 2026 1:51 AM

BRS Leader Harish Rao Fires On Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏ మాత్రం స్వచ్ఛత లేదని, స్పష్టత, విశ్వసనీయత అసలు కన్పించడం లేదని బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష ఉప నేత హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆకాశమంత హామీలిచ్చి బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించిందని అన్నారు. గత బడ్జెట్లు ’గాలి మాటలు’అయితే.. ఈ బడ్జెట్‌ అవాస్తవాల కోట లాగా కనిపిస్తోందని అన్నారు. ‘రైతన్నను ప్రభుత్వం దగా చేసింది. రైతుల పరిస్థితి గోడ దెబ్బ చెంపదెబ్బ అన్నట్టు అయ్యింది. కాంగ్రెస్‌ ’అభయహస్తం’రైతుల పాలిట ‘భస్మాసుర హస్తం’గా మారింది. రైతు రుణమాఫీ ఎక్కడా పూర్తిగా అమలు కాలేదు. రుణమాఫీ అమలు విషయంలో కొడంగల్‌ కానీ, మధిర కానీ ఎక్కడికి వెళ్ళి పరిశీలించడానికైనా నేను సిద్ధం..’అని సవాల్‌ చేశారు. బడ్జెట్‌పై సోమవారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.  

కరోనాలోనూ రైతుబంధు ఇచ్చాం.. 
‘కరోనా కష్టకాలంలోనూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు అమలు చేసింది. ఎకరాకు రూ.15 వేలు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఇస్తామన్న మీ హామీ ఏమైంది? రైతులకు బోనస్‌ ఓ ప్రహసనంగా మారింది. గత యాసంగి బోనస్‌ రూ. 1,161కోట్లు ఎగ్గొట్టారు. బడ్జెట్‌లో పంటల బీమా ఊసే ఎత్తలేదు. బోనస్‌ బోగస్‌ అయ్యింది. బీమా బూటకమయ్యింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి రూ.12 వేలు అమలు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం మోసం చేసింది. 

నిరుద్యోగులకూ దగా.. 
ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అన్న సర్కార్‌ బడ్జెట్‌లో దాని గురించి కూడా ప్రస్తావించలేదు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది? ఓట్ల కోసం అశోక్‌నగర్‌ లైబ్రరీ చుట్టూ తిరిగిన ఈ కాంగ్రెస్‌ పెద్దలే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కావాలంటే, నిరుద్యోగుల వీపులు విమానం మోత మోగిస్తున్నారు. తలలు పగుల గొడుతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు దక్కింది డిప్రెషన్, సప్రెషన్‌ మాత్రమే (ఈ సందర్భంగా అధికార పార్టీని విమర్శిస్తూ హరీశ్‌ కవిత చదివారు)..’అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.  

ఎస్సీ, ఎస్టీలకూ మొండి చెయ్యే  
‘ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్‌ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయించినా, ఏ యువకుల ఖాతాల్లోనూ డబ్బులు పడలేదు. పథకాలకు రాజీవ్‌గాందీ, ఇందిరమ్మ పేర్లు ఎందుకు పెడుతున్నారు? వారి పేర్లు ఎందుకు బద్నాం చేస్తున్నారు? రేవంత్‌రెడ్డికి వారి మీద ఎలాగూ నమ్మకం లేదు. భట్టి అయినా దీన్ని ఆలోచించాలి. ఈ పథకానికి ‘రేవంత్‌ ఆత్మీయ మోసం’అనో, ‘భట్టి గారి యువ భ్రమలు’అనో పేరు పెట్టుకుంటే బాగుంటుంది. కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందిస్తామన్నారు. బడ్జెట్‌లో ఆ మాటే మాయం చేశారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే రూ.20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు ఇచ్చిన జీవోను బయటపెట్టాలి. లేదంటే మహిళలకు క్షమాపణ చెప్పాలి.  

సాగునీటిపై నిర్లక్ష్యం 
ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న కాంగ్రెస్‌ సర్కార్‌ ఆ హామీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 18 ప్రాజెక్టుల పూర్తి బడ్జెట్‌లో కన్పించడం లేదు. హామీ ఇచ్చిన 11,60,895 ఎకరాల ఆయకట్టు సాగు ఓ భ్రమగా మారింది. విలువలు అడుగంటాయి.. ఆశలు ఆవిరయ్యాయి..ప్రభుత్వం ఆడి తప్పింది.. పాలన పూర్తిగా గాడి తప్పింది. ఆరు గ్యారెంటీలు అమలు చేసింది లేదు. 420 హామీలు నిలబెట్టుకున్నది లేదు..’అని హరీశ్‌రావు విమర్శించారు.   

Advertisement
 
Advertisement
Advertisement