
సాక్షి, అమరావతి: కర్ణాటక ఎన్నికల ఫలితాలకు సరిగ్గా ఒకట్రెండు రోజుల ముందు రాష్ట్రంలో టీడీపీ–బీజేపీ–జనసేన పొత్తు పెట్టుకోవడం ఖాయమంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రకటన చేయడంపై బీజేపీ అధిష్టానం తమ రాష్ట్ర పార్టీని నివేదిక కోరినట్లు తెలిసింది. ఇంతకుముందు.. బీజేపీ అగ్రనాయకులు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు పార్టీ రాష్ట్ర నేతలు చేసిన సూచనల ప్రకారం.. రాష్ట్రంలో టీడీపీతో పొత్తుకు బీజేపీ ఏ మాత్రం సుముఖంగా లేదు.
ఈ అంశాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునీల్ దేవ్‌ధర్ వంటి నేతలు ఈ అంశాన్ని బహిరంగంగానే వివిధ సందర్భాల్లో మీడియా సమక్షంలో కుండబద్దలు కొట్టారు. అయితే, కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సరిగ్గా ఒకరోజు ముందు పవన్ పొత్తు ప్రకటన చేయడం పట్ల బీజేపీ అగ్రనేతల్లో ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం వ్యక్తమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మిత్రపక్షంగా ఉంటూ ఇలాంటి ప్రకటనలు ఏమిటని వారు పార్టీ రాష్ట్ర నేతల నుంచి వివరణ కోరినట్లు సమాచారం. తమకు ఇష్టమున్నా లేకున్నా టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించేందుకు ఒత్తిడి పెంచడం, లేదంటే బెదిరింపు ధోరణులు వంటి ఉద్దేశాలు ఏమైనా ఇందులో దాగి ఉన్నాయా అని బీజేపీ నేతల్లో జోరుగా చర్చ సాగుతోంది.
పొత్తులకు సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి వాతావరణం లేకపోయినా, పవన్ హడావుడిగా రాష్ట్రానికి వచ్చి టీడీపీ–బీజేపీ పొత్తులపై సంకేతాలిచ్చి, ఆ మర్నాడు నేరుగా మూడు పార్టీల పొత్తు ఖాయమంటూ స్వయంగా ప్రకటన చేయడం వెనుక ఆయన ఉద్దేశాలు ఏమై ఉండొచ్చన్న దానిపై బీజేపీ నేతలు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అలాగే, పవన్‌కళ్యాణ్ మాటల సారాంశాలను విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయ బాధ్యులు ఇంగ్లీషు, హిందీలో తర్జుమా చేసి ఢిల్లీలో జాతీయ పార్టీ కార్యాలయానికి చేరవేసినట్లు రాష్ట్ర పార్టీ నాయకులు వెల్లడించారు.