40 మందితో బీజేపీ రాష్ట్ర కమిటీ

BJP state committee with 40 members - Sakshi

ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

సాక్షి, అమరావతి: ఆది నుంచి పార్టీలో కొనసాగిన వారికే పెద్దపీట వేస్తూ బీజేపీ రాష్ట్ర పదాధికారుల కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏర్పాటుచేశారు. ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, పది మంది ఉపాధ్యక్షులు, మరో పది మంది కార్యదర్శులతో కలిపి మొత్తం 40 మందితో పార్టీ రాష్ట్ర కమిటీని ఆదివారం ఆయన ప్రకటించారు. ఇందులో నలుగురు మినహా మిగిలిన వారందరూ తొలి నుంచి బీజేపీలో పనిచేస్తున్న వారే. శాసన మండలిలో బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ మాధవ్‌తో పాటు కేంద్ర స్థాయిలో నామినేటెడ్‌ పదవిలో కొనసాగుతున్న విష్ణువర్ధన్‌రెడ్డికి  పార్టీ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంటి కీలక పదవి కూడా కట్టబెట్టారు. ఇంతకుముందు 98 మందితో రాష్ట్ర కమిటీ ఉండగా, ఇప్పుడు కమిటీ సైజును పూర్తిగా కుదించారు. రాష్ట్ర కమిటీలో చోటు దక్కించుకున్న వారి వివరాలు.. 

అధ్యక్షుడు: సోము వీర్రాజు 
ఉపాధ్యక్షులు: రేలంగి శ్రీదేవి (రాజమండ్రి), కాకు విజయలక్ష్మీ (నెల్లూరు), మాలతీరాణి (ఏలూరు), నిమ్మక జయరాజ్‌ (పార్వతీపురం), పైడి వేణుగోపాల్‌ (శ్రీకాకుళం), విష్ణుకుమార్‌రాజు (విశాఖపట్నం), ఆదినారాయణరెడ్డి (కడప), రావెల కిశోర్‌బాబు (గుంటూరు), పి. సురేంద్రరెడ్డి (నెల్లూరు), చంద్రమౌళి (కర్నూలు). 
ప్రధాన కార్యదర్శులు: పీవీఎన్‌ మాధవ్‌ (విశాఖ), విష్ణువర్థన్‌రెడ్డి (హిందూపురం), లోకుల గాంధి (అరకు), సూర్యనారాయణరాజు (కాకినాడ), ఎన్‌. మధుకర్‌ (అర్గనైజింగ్‌ ప్రధాన కార్యదర్శి,  విజయవాడ)? 
కోశాధికారి, ప్రధాన కార్యాలయ ఇన్‌చార్జి: సత్యమూర్తి (విజయవాడ).

పార్టీని అధికారం దిశగా నడిపిద్దాం 
కార్యవర్గంలో చోటు దక్కించుకున్న నాయకులందరికీ శుభాకాంక్షలు. కొత్త కార్యవర్గం అంతా అంకితభావంతో పనిచేసి పార్టీని రాష్ట్రంలో పటిష్టపరుస్తూ అధికారం దిశగా పనిచేయాలి. కార్యకర్తలందరినీ కలుపుకుంటూ పార్టీని బూత్‌ స్థాయి నుండి పటిష్టపరిచే దిశగా పనిచేయాలి.  
– సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top