
2019లో 4 ఎంపీ సీట్లు గెలిపిస్తే రూ.9 లక్షల కోట్ల అభివృద్ధి
ఇప్పుడు అన్ని సీట్లతో మరింత అభివృద్ధి అంటూ ప్రజల వద్దకు..
ప్రతీ పోలింగ్ బూత్‌కో వాట్సాప్ గ్రూప్
కార్యాచరణ అమలుకు బీజేపీ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కమలదళం ‘సారే కే సారా సత్రా హమారా’ (17 ఎంపీ సీట్లకు 17 సీట్లు మనవే) నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలుపొందుతుందనే ధీమాతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకెళ్లాలని జాతీయనాయకత్వం దిశానిర్దేశం చేసింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి బీజేపీని 4 ఎంపీ సీట్లలో గెలిపిస్తే రూ. 9 లక్షల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, వచ్చే ఎన్నికల్లో అన్ని ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే అంతకు మించి అభివృద్ధి చేస్తామంటూ ప్రజల వద్దకు వెళ్లాలని సూచించినట్టు పార్టీ వర్గాల సమాచారం.
రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల కార్యాచరణ అమలుకు సిద్ధమైంది. ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో బీజేపీ తరఫున పోటీలో ఉన్న 17 మంది ఎంపీ అభ్యర్థులు రోజూ క్రమం తప్పకుండా పర్యటనలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ ముఖ్యనాయకులతో సమావేశం కావడం, నాయకులు, కార్యకర్తల మధ్య మెరుగైన సమన్వయం సాధించడంపై దృష్టి పెట్టాలని అభ్యర్థులకు సూచించారు.
ప్రతీ బూత్‌కో వాట్సాప్ గ్రూప్!
ఎన్నికల మేనేజ్‌మెంట్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. పోలింగ్‌బూత్‌లే కేంద్రంగా కార్యాచరణను అమలుచేస్తోంది. ఇక్కడి 17 ఎంపీ సీట్లు, వాటి పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోని పోలింగ్‌బూత్‌లే కేంద్రంగా క్షేత్రస్థాయి నుంచి పని విధానాన్ని ఖరారు చేసింది. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రతీ పోలింగ్‌బూత్‌కు ఒక వాట్సాప్‌గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బూత్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, బూత్ లెవల్ ఆర్గనైజర్, బూత్ ఆర్డినేటర్ల నియామకం ద్వారా పోలింగ్‌బూత్‌స్థాయిలో రోజువారీ కార్యక్రమాల పర్యవేక్షణ, నాయకులు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు.
అన్ని బూత్‌లలో కమిటీల ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల కమిటీలు, బేటీ బచావో బేటీ పడావో కమిటీ, ఒక్కో పోలింగ్‌బూత్‌లోని ఓటర్ల సమాచారం, బూత్‌ల పరిధిలోనే ప్రతిరోజు బైక్‌లపై కార్యకర్తల పర్యటనలు, పార్టీపరంగా చేపడుతున్న పనులపై పర్యవేక్షణ వంటివి చేపట్టనున్నారు. దీంతో పాటు ఒక్కో లోక్‌సభ స్థానానికి విడిగా కాల్‌సెంటర్ ఏర్పాటు ద్వారా బూత్‌కమిటీలపై పర్యవేక్షణతో పాటు కేంద్ర పథకాల లబ్ధిదారుల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించారు.
ఇక ముందూ అదే జోష్‌తో
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల కంటే ముందుగా అభ్యర్థుల ఖరారుతో పాటు తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసిన జోష్‌ను ఇక ముందూ కొనసాగించాలని నాయకత్వం నిర్ణయించింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, ఇతర పార్టీల నుంచి చేరికలు, పోలింగ్‌బూత్‌స్థాయి వరకు పార్టీ కార్యక్రమాల వికేంద్రీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రధాని మోదీ రాష్ట్రంలో మొదటి విడత ఎన్నికల ప్రచారాన్ని చేయగా, మరో విడతలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌గడ్కరీ ఇతర ముఖ్యనేతల పర్యటనలు చేపట్టనున్నారు.