
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, ఆ పార్టీ ప్రజల రక్తం తాగిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలకే దిక్కులేదు.. మరి తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్‌వి ఫేక్ గ్యారంటీలు.. ఆచరణ సాధ్యం కాని హామీలను ఓట్ల కోసమే ఇచ్చారు’అని మండిపడ్డారు. సోమవారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలనపై ప్రజలు తిరగబడుతున్నారని, తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థులకు మంచి ఆదరణ లభిస్తోందని, ముఖ్యంగా యువత నుంచి అత్యధిక మద్దతు లభిస్తోందని చెప్పారు. అందరికీ న్యాయం చేసేలా బీజేపీ మేనిఫెస్టో ఉందని, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవెరుస్తామని తెలిపారు. ‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ కోసం బీజేపీ ముందుకు వెళ్తుంది. రూ.3,100 మద్దతు ధరకు ధాన్యాన్ని కొంటాం. రైతుల మీద భారం పడకుండా పంటల బీమా అమలు చేస్తాం. వ్యాట్ తగ్గించడం ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాము. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మహిళలకు 10 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాం’అని కిషన్‌రెడ్డి చెప్పారు.
సీఎం కేసీఆర్ సింగరేణిని ప్రైవేట్‌పరం చేసి దానిని బీజేపీపై నెట్టే ప్రయత్నం చేశారని, అధికారంలోకి వస్తే సింగరేణిని పటిష్టం చేస్తామని భరోసా వచ్చారు. బీజేపీ అధికారంలోకి రాకపోతే రాష్ట్రం అధోగతి పాలు అవుతుందన్నారు.
రాహుల్ గాంధీ పారిపోయారు..
‘పార్టీని నడిపించలేను.. అంటూ కాంగ్రెస్‌నేత రాహుల్ గాంధీ విదేశాలకు పారిపోయారు. అలాంటి పార్టీ మాకు నీతులు చెపుతుందా?’అని కిషన్‌రెడ్డి ఎద్దేవాచేశారు. బీసీ సీఎం విషయంలో కాంగ్రెస్ పార్టీ తమను అవమానిస్తోందని, కాంగ్రెస్‌కు దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో డిపాజిట్ రాలేదు.. మరి వాళ్లు ఎలా 6 గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని ప్రశ్నించారు. ‘కేసీఆర్ ది ప్యూడలిస్ట్ మెంటాలిటీ.. ఒక ప్యూడలిస్ట్ పోతే మరో ప్యూడలిస్ట్ వస్తాడు. బీఆర్‌ఎస్‌లో ప్రచారం చేస్తోంది ఆ నలుగురే, మిగతా వాళ్లను తిరగనీయరు’అని అన్నారు.
రెడ్డి సామాజికవర్గానికి చెందిన తనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ప్రకటించాక, బీసీ నేతను సీఎం చేస్తామని బీజేపీ చెప్పిందన్నారు. ఇదే బీజేపీ సామాజిక న్యాయమన్నారు. కేసీఆర్ సర్కార్ అవినీతిపై రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని తమ మేనిఫెస్టోలో హామీనిచ్చామని తెలిపారు. అవినీతికి పాల్పడితే ఎంత పెద్ద వారైనా వదిలిపెట్టమన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను పాతర వేస్తారని వ్యాఖ్యానించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ పాల్గొనేలా రాష్ట్రంలో మరో ఆరు సభలు పెట్టాలని నిర్ణయించామని పీఎంఓ, బీజేపీ నాయకత్వం నుంచి ఆమోదం రాగానే వాటిని ఎప్పుడు, ఎక్కడెక్కడ నిర్వహించాలన్నది ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment