ప్రగతి భవన్‌ను బద్దలు కొడతాం | Sakshi
Sakshi News home page

ప్రగతి భవన్‌ను బద్దలు కొడతాం

Published Mon, Feb 28 2022 3:06 AM

Bhatti Vikramarka Padayatra Begins In Khammam - Sakshi

ముదిగొండ: ప్రజా సమస్యలు పరిష్కరించాలని, నిరుద్యోగుల గోడు తీర్చాలని కోరుతూ ప్రగతి భవన్‌ను బద్దలు కొడతామని కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లి నుంచి పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రను చేపట్టారు. స్థానిక శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, సతీమణి నందిని, కుమారుడు విక్రమాదిత్యతో కలసి ముందుకు సాగారు. తొలిరోజు పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. తొలిరోజు యాత్ర యడవల్లి నుంచి మాధాపురం, కట్టకూరు, మేడేపల్లి, యడవల్లి లక్ష్మీపురం మీదుగా ముదిగొండ వరకు 18 కిలోమీటర్ల మేర సాగింది. మార్గమధ్యలో పొలాల్లో పని చేసే కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి, అక్కడి గోసపై పోరాడుతామని తెలిపారు. సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్‌ పాలన కొనసాగుతుందని విమర్శించారు.  

కేసులు పెట్టేందుకు సిగ్గుండాలి.. 
ఎనిమిదేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రూప్‌–1, డీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్‌ వేయకుండా, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన కేసీఆర్‌.. ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. సమస్యలపై ప్రశ్నించే వారిపై సీఎం కేసులు పెట్టిస్తున్నారని, ఉద్యోగ నోటిఫికేషన్లు చేయాలని ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై కేసులు పెట్టి నిర్బంధించడానికి సిగ్గుండాలని విమర్శించారు. ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఒక్క పథకమైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టడానికి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నట్లు సీఎం కేసీఆర్‌ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. పాదయాత్రలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement