
మహేశ్వరం సిరిగిరిపురం గేటు వద్ద మీడియాతో మాట్లాడుతున్న బండి సంజయ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని.. భాగ్యనగరంలో ఉన్న హిందువులందరినీ ఏకం చేసి ఎంఐఎంకు బుద్ధి చెప్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హిందూ కులవృత్తులను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా పలుచోట్ల సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో పేదల నుంచి భూములు లాక్కొని రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు.
పదవి కోసం పార్టీ మారి..
కాంగ్రెస్ తరఫున గెలుపొందిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. తర్వాత పదవుల కోసం టీఆర్‌ఎస్‌లో చేరారని, పార్టీ మారిన తర్వాత మహేశ్వరం నియోజకవర్గాన్ని ఆమె ఏ మేరకు అభివృద్ధి చేశారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహేశ్వరానికి ఎన్ని నిధులు కేటాయించిందో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
ప్రధాని మోదీ ఇచ్చిన ఇళ్లపై కేసీఆర్‌ను ప్రశ్నించే ధైర్యం సబితకు ఉందా? అని ప్రశ్నిం చారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లలో జంప్ జిలానీలు ఉన్నారని.. వారు అధికారం ఎక్కడుంటే అక్కడికే చేరుకుని అక్రమ ఆస్తులు కూడగడుతుంటారని సంజయ్ ఆరోపించారు. అదే బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రజల ఆకాంక్షల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తారన్నారు. అమిత్‌షా సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు.
సీపీఎస్‌ను రద్దు చేయించండి
రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దు చేసేలా, వెంటనే బదిలీలు, పదోన్నతులు చేపట్టేలా, 317 జీవో బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని.. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్‌రావు, నవాత్ సురేశ్ తదితరులు బండి సంజయ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
నేటితో రెండో విడత ముగింపు
బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర శనివారం అమిత్‌షా బహిరంగ సభతో ముగియనుంది. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా అలంపూర్ నుంచి సంజయ్ యాత్ర ప్రారంభించారు. మూడు లోక్‌సభ, 9 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 31 రోజుల పాటు 383 కిలోమీటర్ల దూరం యాత్ర పూర్తవుతోంది. తొమ్మిదిచోట్ల బహిరంగ సభలతోపాటు యాత్ర మధ్యలో కులవృత్తుల వారితో సమావేశాలను, గ్రామ సభలను నిర్వహించారు.
జూన్ 10 నుంచి మూడో విడత!
బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రను జూన్ 10న మేడారం సమ్మక్క, సార లమ్మ ఆశీస్సులు తీసుకుని ప్రారంభించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి వరంగల్, నల్ల గొండ మీదుగా 20 రోజులపాటు 300 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని, జూన్ 30న యాదాద్రి భువనగిరిలో ముగిస్తారని పేర్కొన్నాయి.
నోటీసులకు బెదిరే ప్రసక్తే లేదు..
మహేశ్వరం: మంత్రి కేటీఆర్ తనకు లీగల్ నోటీసులు పంపడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నోటీసుల పేరుతో కేసీఆర్, కేటీఆర్‌లు చేసే తాటాకు చప్పుళ్లకు తాము బెదిరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అవసరమైతే ఐక్యరాజ్యసమితికి పోయి నోటీస్ ఇచ్చుకొమ్మని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో ఉన్న సంజయ్ రంగారెడ్డి జిల్లా సిరిగిరిపురం గేటు వద్ద మీడియాతో మాట్లాడారు.
‘‘ఇంటర్ విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనా సంస్థతో కేటీఆర్‌కు సంబంధం లేకుంటే.. ఆ వ్యవహారంలో ఐటీ శాఖ తప్పులేదని భావిస్తే.. సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయాలి. మీ నిర్వాకం వల్ల 27 మంది విద్యార్థులు చనిపోయారు. దానిపై కేసీఆర్ కనీసం స్పందించలేదు. విద్యార్థులకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు బాధ చెప్పుకోవడానికి పోతే లాఠీ చార్జీ చేయించిన దుర్మార్గపు కుటుంబం మీది.
మీరు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల వందల మంది ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి నువ్వు, మీ తండ్రి కారణమని నోటీసులు ఇవ్వు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు, గుండెపోటు మరణాలకు మీతండ్రే కారణం. 317 జీవోతో ఉద్యోగులు ఇంటికొకరు, పుట్టకొకరు అయి బాధపడుతున్నారు. వరి వేస్తే ఉరే అన్న ప్రకటనతో వరి కల్లాల మీద రైతులు తనువు చాలించారు. వీటన్నింటిపై ఇవ్వండి లీగల్ నోటీసులు. దళితుడే సీఎం, మూడెకరాల భూమి, అంబేడ్కర్ విగ్రహం, రుణమాఫీ, ఇంటికో ఉద్యోగమని హామీలిచ్చి మోసం చేసిన మీ మీద 420 కేసు పెట్టాలి.’’అని సంజయ్ మండిపడ్డారు. గ్లోబరీనాతో లింకులన్నీ బయటికి తీస్తున్నామని, మీ సంగతి తేలుస్తామని వ్యాఖ్యానించారు.