కశ్మీర్‌ ఫైల్స్‌.. పొలిటికల్‌ హీట్‌! చిత్రయూనిట్‌కు ఉగ్రవాదులతో లింకులంటూ ఆరోపణలు

Ashok Gehlot Prakash Raj Jitan Ram Manjhi Fire On Kashmir Files - Sakshi

ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా సంచలనాలతో పాటు రాజకీయ పరమైన చర్చలకూ నెలవైంది ఇప్పుడు. ఆర్టిస్టుల పర్‌ఫార్మెన్స్‌, సినిమా కలెక్షన్లు సంగతి పక్కనపెడితే.. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాను విపరీతంగా ప్రమోట్‌ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇక విమర్శలకతీతంగా.. దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రిపై ప్రశంసలు గుప్పిస్తున్నారంతా. మరోపక్క విపక్షాలు సినిమాపై తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా The Kashmir Files అబద్ధాలు చూపించిందని సెటైర్లు గుప్పించారు. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ సైతం సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. నటుడు ప్రకాశ్‌రాజ్‌ కూడా ఈ అంశంపై వీడియో పోస్ట్‌తో ఓ ట్వీట్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. ఎన్డీఏ భాగస్వామి నేత ఒకరు కశ్మీర్‌ ఫైల్స్‌పై సంచలన ఆరోపణలకు దిగారు. ఎన్డీఏ కూటమిలో భాగమైన Hindustani Awam Morcha వ్యవస్థాపకుడు, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ సంచలన ఆరోపణలు చేశారు. ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా మేకర్లకు ఉగ్రవాద సంబంధిత గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు ఆయన. 

ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాకు బీహార్‌లో ట్యాక్స్‌ మినహాయింపు ప్రకటించింది ప్రభుత్వం. ఆ మరునాడే జితన్‌ మాంఝీ విమర్శలు గుప్పించడం విశేషం. ‘‘ఈ మూవీ కాశ్మీరీ పండిట్‌లు కాశ్మీర్‌కు తిరిగి రాకుండా వారిలో భయాందోళనలు రేకెత్తించేందుకు ఉగ్రవాద సంస్థల కుట్రగా కనిపిస్తుంద’’ని ట్వీట్‌ చేశారు మాంఝీ. అంతేకాదు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రితో సహా కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్ర యూనిట్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉండొచ్చన్న మాంఝీ.. ఈ విషయంపై సీరియస్‌గా దర్యాప్తు  చేయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. ది కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రికి వై కేటగిరీ భద్రతను అందించింది కేంద్రం. కశ్మీర్‌ ఫైల్స్‌ విడుదల అయినప్పటి నుంచి సోషల్‌ మీడియాలో ఆయనకు బెదిరింపులు వస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే ఏడు నుంచి ఎనిమిది సీఆర్పీఎఫ్‌ కమాండోలు ఆయనకు భద్రత కల్పించనున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top