సకల విద్యార్థి సమీకృతం | - | Sakshi
Sakshi News home page

సకల విద్యార్థి సమీకృతం

Apr 6 2026 8:48 AM | Updated on Apr 6 2026 8:48 AM

మంథనిరూరల్‌: కుల, మత, వర్గ వివక్ష లేకుండా ఒకేచోట పేద విద్యార్థులకు విద్య బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టింది. ఆధునిక కాలానికి అనుగుణంగా బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న సంకల్పంతో సకల విద్యార్థి సమీకృతం వైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మంథని మండలం అడవిసోమన్‌పల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణానికి గతేడాది మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేయగా పనులు కొనసాగుతున్నాయి.

25ఎకరాలు.. రూ.145కోట్ల వ్యయంతో..

అడవిసోమన్‌పల్లి శివారులో సుమారు 25ఎకరాల విస్తీర్ణంలో రూ.145కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాదిలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి.

4వ తరగతి నుంచి..

నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌లో 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన అందించనున్నారు. తరగతి గదుల్లో డిజిటల్‌ స్మార్ట్‌ బోర్డు, కంప్యూటర్‌ ల్యాబ్‌, లైబ్రరీలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే క్రీడా ప్రాంగణం, సౌకర్యాలు కల్పించనున్నారు. విద్యుత్‌ సమస్యలు రాకుండా సోలార్‌ విద్యుత్‌తో లిఫ్ట్‌లు, ఇతర ఉపకరణాల నిర్వహణ జరిగేలా ఏర్పాట్లు చేయనున్నారు.

2,500మంది విద్యార్థులకు..

ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌లో 2,500 మంది విద్యార్థులకు విద్యాబోధన అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు సమీకృత భవనంలో చదువుకోనున్నారు. సమీకృత భవనంలో వివిధ బ్లాకులుగా విభజించి విద్యాబోధన చేస్తారు. ఒక్కో బ్లాక్‌లో 640 మంది విద్యార్థుల చొప్పున కేటాయిస్తారు.

ప్రత్యేక నివాస సముదాయాలు

విద్యార్థులతో పాటు విద్యాబోధన అందించేందుకు జీ ప్లస్‌ 2 భవనాలు నిర్మించనున్నారు. ఇందులో పాఠశాల ప్రిన్సిపాల్స్‌, బోధన సిబ్బంది, వసతి గృహా వార్డెన్‌ల కోసం ప్రత్యేక భవన సముదాయం ఏర్పాటు చేస్తారు. విద్యార్థులకు సైతం ప్రత్యేక బెడ్‌లు, ఒకేసారి 1,200 మంది భోజనం చేసేలా డైనింగ్‌ హాల్‌ నిర్మించున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యం కోసం ఆరోగ్య సంరక్షణ కేంద్రం, తల్లిదండ్రులు, సందర్శకుల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేయనున్నారు.

విద్యాహబ్‌గా మారనున్న అడవిసోమన్‌పల్లి

మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో జిల్లా సరిహద్దు మానేరు నది తీరంలోని అడవిసోమన్‌పల్లి విద్యాహబ్‌గా మారనుంది. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ గురుకుల పాఠశాలతో గ్రామం రూపురేఖలు మారనున్నాయి. ఈ పాఠశాల పూర్తయితే వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడే చదువుకునే అవకాశాలుంటాయి. దీంతో మంథని– కాటారం ప్రధాన రహదారిలోని ఈ గ్రామానికి ఇన్నేళ్ల తర్వాత మంత్రి చొరవతో మహర్దశ సంతరించుకోనుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణం

25 ఎకరాల విస్తీర్ణంలో రూ.145కోట్లతో పనులు షురూ

కార్పొరేట్‌కు దీటుగా సకల సౌకర్యాల కల్పనకు ఏర్పాట్లు

అడవిసోమన్‌పల్లిలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌

పేద విద్యార్థులకు ప్రయోజనం

మా ఊరిలో నిర్మించే ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌తో పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మంచి బోధన అందుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేలా మంత్రి చర్యలు తీసుకోవడం అభినందనీయం.

– గట్టు జనార్ధన్‌, అడవిసోమన్‌పల్లి

మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో..

మంత్రి శ్రీధర్‌బాబు చొరవతోనే మా గ్రామానికి అభివృద్ధి బాటలు పడుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌తో గ్రామం మరింత అభివృద్ధి చెందుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పేద విద్యార్థులు ఇక్కడే చదువుకునే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో మా ఊరికి అన్ని సౌకర్యాలు మెరుగుపడుతాయి. మా ఊరి అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రికి కృతజ్ఞతలు.

– గట్టు దామోదర్‌, సర్పంచ్‌, అడవిసోమన్‌పల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement