గోదావరిఖని(రామగుండం): లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా ఆదివారం ప్రకటనలో హెచ్చరించారు. గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టవిరుద్ధమన్నారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలు చట్టబద్ధమైన నమోదు ద్వారా మాత్రమే నిర్వహించాలని సూచించారు. మొదటిసారి నేరం చేస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారని, పునరావృతం అయితే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేలు లేదా అంతకుమించి జరిమానా విధిస్తారన్నారు. సంబంధిత వైద్యులు, సిబ్బంది చట్టాన్ని ఉల్లంఘిస్తే వారి వైద్య అనుమతిపత్రాన్ని సస్పెండ్ చేయడం, పూర్తిగా రద్దు చేస్తారని పేర్కొన్నారు.
సింగరేణిని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం ఏటీఎంగా వాడుకుంటూ నిర్వీర్యం చేస్తుందని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఆదివారం ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్‌కాలనీ టీబీజీకేఎస్ కార్యాలయంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభత్వం రెండున్నరేళ్లలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయకపోగా కారుణ్య నియామకాలను తొలగించే కుట్ర చేస్తుందని ఆరోపించారు. రూ.56కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో కార్మికులకు ఇంక్రిమెంట్లు రాకుండా నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికై నా కొంత మేర బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో సంస్థను రక్షించుకునేందుకు కార్మికులను చైతన్యం చేసేలా ‘కాంగ్రెస్ హటావో.. సింగరేణి బచావో’ నినాదంతో బీఆర్‌ఎస్ పార్టీ సహకారంతో సింగరేణిని రక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఆర్జీ–2 వైస్ ప్రెసిడెంట్ ఐలి శ్రీనివాస్, సంపత్, శ్రీనివాస్, రామ్‌చంద్రారెడ్డి, శంకర్, రవి, రామ్‌చరణ్, జీవన్, కుమారస్వామి, నారాయణరెడ్డి, వెంకట్, రాజు పాల్గొన్నారు.
సీఎంను సొంత పార్టీ కార్యకర్తలే గుర్తిస్తలేరు
మంథని: సీఎం రేవంత్‌రెడ్డిని సొంత పార్టీ కార్యకర్తలే గుర్తిస్తలేరని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఎద్దేవా చేశారు. ఆదివారం మంథనిలోని రాజగృహాలో మాట్లాడారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో చులకనైందని, ప్రజల చివాట్ల నుంచి దృష్టి మళ్లించేందుకే బీఆర్‌ఎస్ ఆఫీసులపై దాడులకు పాల్పడుతోందని అన్నారు. గజ్వేల్‌లోని మాజీ సీఎం కేసీఆర్ ఆఫీస్‌పై దాడి చేయడం ప్రజాస్వామ్యానికే అవమానమన్నారు. రాష్ట్రంలో సంపాదన సృష్టించకుండా ధ్వంసం చేస్తున్నారని, అన్ని వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. అనంతరం జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీ మండల అధ్యక్షుడు ఏగోళపు శంకర్‌గౌడ్, నాయకులు తగరం శంకర్‌లాల్, వేల్పుల గట్టయ్య, కనవేన శ్రీనివాస్, పుప్పాల తిరుపతి, లొడారి రాములు, గొబ్బూరి వంశీ తదితరులు పాల్గొన్నారు.
క్రీడా పాఠశాల పోటీలకు ఎంపిక
ధర్మారం: మండలంలోని పత్తిపాక ప్రాథమిక పాఠశాల విద్యార్థి ఎదుల్ల ప్రజ్వల్ రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాల పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం మల్లన్న తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన తొమ్మిది రకాల ఈవెంట్స్‌లో ప్రతిభ కనపర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సురేశ్ ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ నెల చివరి వారంలో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర పోటీల్లో పాల్గొంటాడని వివరించారు. ఈసందర్భంగా ప్రజ్వల్‌ను సర్పంచ్ మాందాల శ్రావణి, ఉపాధ్యాయులు అభినందించారు.


