కూలగొట్టారా? | - | Sakshi
Sakshi News home page

కూలగొట్టారా?

Dec 18 2025 10:58 AM | Updated on Dec 18 2025 10:58 AM

కూలగొ

కూలగొట్టారా?

కొట్టుకుపోయిందా..

మంథనిరూరల్‌: పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లి మానేరుపై నిర్మించిన చెక్‌డ్యాం కొట్టుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్‌ హయాంలో మానేరుపై చెక్‌డ్యాం నిర్మించగా బుధవారం వేకువజామున సుమారు పది మీటర్ల పొడవున కొట్టుకుపోయింది. వరద ఉధృతికి కొట్టుకుపోయిందా? ఎవరైనా కావాలనే కూలగొట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేపలు పట్టేందుకు గ్రామానికి చెందిన కొందరు వెళ్లి వచ్చిన కాసేపటికే చెక్‌డ్యాం కొట్టుకు పోయిందని చెబుతున్నారు. గత నవంబర్‌లో జిల్లాలోని గుంపుల వద్ద చెక్‌డ్యాం కొట్టుకుపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం విదితమే. అదే తరహాలో ఇక్కడ కూడా జరిగి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది.

జిల్లాలో 16 చెక్‌డ్యాంలు..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జిల్లాలో మానేరు నదిపై వివిధ చోట్ల 16 చెక్‌డ్యాంలు నిర్మించింది. ఇందుకోసం రూ.128కోట్లు వెచ్చించింది. ఇందులో మంథని మండలం అడవిసోమన్‌పల్లి, చిన్నఓదాల, గోపాల్‌పూర్‌ ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు ఉన్నాయి. అడవిసోమన్‌పల్లి వద్ద నిర్మించిన చెక్‌డ్యాం అవతలివైపు కొట్టుకుపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

బుంగపడి.. కుంగిపోయిందా..?

కొద్దిరోజుల క్రితం చెక్‌డ్యాం వద్ద పెద్దబుంగపడిందని స్థానికులు చెబుతున్నారు. ప్రతీరోజు చేపలు పట్టేందుకు కొందరు అక్కడకు వెళ్తుంటారని, అక్కడక్కడా పగుళ్లతోపాటు బుంగ కూడా కనిపించిందని స్థానికులు తెలిపారు. మానేరులో ప్రస్తుతం వరద కూడా అధికంగానే ఉందని, ఈక్రమంలో బుంగతోనే కుంగిపోయి కొట్టుకుపోయిందని స్థానికులు అంటున్నారు.

నాణ్యతపై ఆరోపణలు..

చెక్‌డ్యాంల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న చెక్‌డ్యాంలపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే కాంట్రాక్టర్‌లు ఇష్టారాజ్యంగా నిర్మించారనే వాదనలు వినిపించాయి. కానీ భారీవర్షాల సమయంలో కొట్టుకుపోకుండా ప్రస్తుతం నామమాత్రంగా వచ్చిన వరద తాకిడితో కొట్టుకుపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల పరిశీలన..

చెక్‌డ్యాం కొట్టుకుపోయిందన్న సమాచారం మేరకు ఇరిగేషన్‌ ఏఈ నిఖిల్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద తాకిడితో కొట్టుకుపోయిందా? లేక ఎవరైనా కూలగొట్టారా? అనే కోణంలో పరిశీలన చేశారు. అక్కడి పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నాయని, వరద తాకిడితో కొట్టుకుపోయినట్లు కనిపించడం లేదని ఏఈఈ తెలిపారు. ఘటనపై అధికారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.

కూలిన అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యాం

నాసిరకమా?.. కావాలనే కూల్చారా?

పరిశీలించిన ఇరిగేషన్‌ అధికారులు

చెక్‌డ్యాం కొట్టుకుపోవడంపై అనుమానాలు

కూలగొట్టారా? 1
1/1

కూలగొట్టారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement