‘మెమొరీ’ కొమురయ్య
● నిత్యం యాదిలోనే వందలాది ఫోన్‌నంబర్లు
● నంబర్ ఫీడ్ చేయని సాధారణ ఫోన్ వినియోగం
రామగుండం: సుమారు వంద మందికి పైగా ప్రముఖులు, సాధారణ వ్యక్తుల ఫోన్‌నంబర్లను చూడకుండా చెబుతూ అప్పటికప్పుడు వారితో సంభాషిస్తుంటాడు గోపు కొమురయ్య యాదవ్. ఆండ్రాయిడ్ కాకుండా సాధారణ ఫోన్ వినియోగిస్తూ నంబర్లను గుర్తుంచుకుంటూ సంభాషిస్తుండడం ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామానికి పదిహేనేళ్ల క్రితం సర్పంచ్‌గా పని చేసిన గోపు కొమురయ్యయాదవ్ నేటికీ సాధారణ ఫోన్ వినియోగిస్తుంటాడు. అతనికి ఇతర ఫోన్ నంబర్లను ఫీడ్ చేసుకోవడం రాకపోగా, ఫీడ్ చేసి ఉన్న నంబర్లను గుర్తించడం కూడా రాదు. ఆయన పదవీ కాలం నుంచే సెల్‌నంబర్లను గుర్తుంచుకుంటూ ఫోన్‌లో డయల్ చేసి మాట్లాడడం ఆయన ప్రత్యేకత. ఒకవేళ ఊర్లో ఎవరికై నా ఎవరి నంబరైనా కావాల్సి వస్తే కొమురయ్యను సంప్రదిస్తుంటారు. పేపర్‌లో రాసుకో అంటూ నంబర్‌ను టకాటకా చెప్పేస్తారు. ఒకసారి అతనికి మన నంబర్ చెబితే అట్టే గుర్తుంచుకోవడం ఆయన ప్రత్యేకత. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులకు ఓటర్ల నంబర్లు కావాల్సి వస్తే నేరుగా కొమురయ్యను సంప్రదిస్తుంటారు.


