వరికి నష్టం.. పత్తి కష్టం
పంటలపై మోంథా తుపాన్ తీవ్ర ప్రభావం నేలవాలిన వరి.. రంగుమారిన పత్తి.. తడిసిన ధాన్యం తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు పంట నష్టం అంచనాల్లో యంత్రాంగం
సాక్షి పెద్దపల్లి: జిల్లా రైతులను మోంథా తుపాను నిండా ముంచేసింది. రెండురోజులుగా కురిసిన వర్షాలతో పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఈదురుగాలుల ప్రభావానికి వరి, ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. పొట్టకొచ్చిన వరి నేలరాలడం, తేమతో పత్తికాయలు చెట్లపైనే కుళ్లిపోతున్నాయి. మొక్కజొన్నలు తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిముద్దయింది. తుపాన్ ప్రభావంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లగా, ప్రాణనష్టం ఎక్కడా సంభవించలేదు. జిల్లాలో ఈసీజన్‌లో రైతులు 2.12లక్షల ఎకరాల్లో వరి, 52వేల ఎకరాల్లో పత్తి, 705 ఎకరాల్లో మొక్కజొన్న, 10వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగు చేశారు. గురువారం జిల్లావ్యాప్తంగా అధికారులు పంటనష్టంపై సర్వే నిర్వహించి మేజర్ డ్యామేజీ జరగలేదని చెబుతున్నారు. కేవలం సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్‌లో 196మంది రైతులకు చెందిన 271 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొంటున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. వేలాది ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
వణికించిన తుపాను
మోంథా తుపాన్ ఎఫెక్ట్‌తో రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు మరో రెండు రోజులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే గురువారం ఉదయం నుంచి వర్షం తెరిపినివ్వడంతో అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు. తడిసిన, కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఆరబెట్టుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. గరువారం సైతం వర్షం దంచికొడితే పూర్తిగా నష్టపోయేవారమని అన్నదాతలు వాపోతున్నారు.
కలిసిరాని కాలం
ఈ ఏడాది అన్నదాతలకు కాలం కలిసిరాలేదు. ముందస్తు వానలు పడుతాయన్న వాతావరణ సూచనలతో సీజన్ మొదట సాగు చేసినవారికి వానలు కురవక నష్టపోయారు. పత్తి విత్తనాలు రెండోసారి నాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీరా సాగు చేశాక అకాలవర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆగస్టులో కురిసిన వర్షాలతో జిల్లాలో 1,015 మంది రైతులకు చెందిన 1,752 ఎకరాల్లో వరి పంటలు నీట మునిగినట్లు వ్యవసాయశాఖ అ ధికారులు పంట నష్టంపై నివేదిక తయారు చేసి ప్ర భుత్వానికి సమర్పించారు. తాజాగా మోంథా తు పానుతో కోతకొచ్చిన వరి నేలవాలగా, పూతకొ చ్చిన పత్తి తడిసి రంగు మారడంతో ఈసారి సాగు కలిసిరాలేందంటూ రైతన్నలు వాపోతున్నారు.
ప్రతిపాదనలకే పరిమితమైన పరిహారం
అకాలవర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల పరిహారం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే మార్చి నుంచి ఇప్పటి వరకు వర్షాల కారణంగా రైతులకు జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేసి రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారు. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బాధిత రైతులకు పరిహారం అందకపోగా, ప్రతిపాదనల దశలోనే మగ్గుతున్నట్లు తెలుస్తోంది. వరుస దెబ్బలతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ముత్తారం: ఓడెడ్ మానేరు వద్ద బ్రిడ్జి పిల్లర్ల వరకు చేరిన వరద ఉధృతి
రేగడిమద్దికుంట కేంద్రంలో ధాన్యం ఆరబోస్తున్న రైతులు
జిల్లాలో చెరువులు ఇలా..
ప్రభుత్వం ఆదుకోవాలి
మార్కెట్‌లోయార్డులో నిల్వ చేసిన ధాన్యం కొట్టుకుపోయి భారీగా నష్టం జరిగింది. రెండురోజుల క్రితం యార్డులో ధాన్యం పోసినం. పలువురు రైతులకు చెందిన సుమారు వెయ్యి క్వింటాళ్లు తడిసినయి. ప్రభుత్వం ఆదుకోవాలి.
– నరేశ్, రైతు, ఖానాపూర్, మంథని
ఎకరం పూర్తిగా పోయింది
నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వరి వేసిన. ఇటీవల వర్షాలతోనే పంట బాగా దెబ్బతింది. మళ్లీ తుపాన్‌తో ఎకరం పూర్తిగా నేలవాలింది. కోతకు వచ్చిన పంట నీటిలోనే తేలుతాంది. మిగిలిన పంట కూడా చేతికచ్చే దాక నమ్మకం లేదు.
– ఎస్‌కే బాబు, కౌలు రైతు, మల్లెపల్లి, మంథని
మూడెకరాలు మునిగింది
మూడెకరాల్లో వరి సాగుచేస్తే తుపాను ముంచింది. వరదకు పొలమంతా నేలవాలింది. కిందపడిన వరిగింజలు మొలకెత్తాయి. దాదాపు రూ.2లక్షల నష్టం జరిగింది. ప్రభుత్వం ఆదుకోవాలి.
– కర్ర నరేశ్, రైతు, గూడెం, ఓదెల
వివరాలు సేకరిస్తున్నాం
తుపాన్ కారణంగా రైతులకు ఏ మేర పంట నష్టం జరిగిందనే వివరాలను ప్రాథమికంగా సేకరిస్తున్నాం. పంటలకు పెద్దగా నష్టం కలగకపోవచ్చనే అంచనాకు వచ్చాం. పంట దిగుబడులను కాపాడుకునేందుకు పాటించాల్సిన పద్ధతులను సూచిస్తున్నాం.
– శ్రీనాథ్,
ఏడీఏ, పెద్దపల్లి
మత్తడి పోస్తున్నవి 459
75–100 శాతం 479
50–75 శాతం 67
25–50 శాతం 16
మొత్తం చెరువులు 1,021
వరికి నష్టం.. పత్తి కష్టం
వరికి నష్టం.. పత్తి కష్టం
వరికి నష్టం.. పత్తి కష్టం
వరికి నష్టం.. పత్తి కష్టం
వరికి నష్టం.. పత్తి కష్టం
వరికి నష్టం.. పత్తి కష్టం
వరికి నష్టం.. పత్తి కష్టం
వరికి నష్టం.. పత్తి కష్టం
వరికి నష్టం.. పత్తి కష్టం
వరికి నష్టం.. పత్తి కష్టం
వరికి నష్టం.. పత్తి కష్టం
వరికి నష్టం.. పత్తి కష్టం
వరికి నష్టం.. పత్తి కష్టం


