
శతాధిక వృద్ధురాలు మృతి
రామడుగు: రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు చేని నర్సవ్వ(106) బుధవారం ఆనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. నర్సవ్వకు ముగ్గురు కొడుకులు, కుతురు ఉన్నారు. ప్రస్తుతం వారి మొత్తం కుటుంబ సభ్యులు 68మంది వరకు ఉంటారని గ్రామస్తులు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి..
జమ్మికుంట: పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి వివరాల ప్రకారం.. జమ్మికుంట రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపై గుర్తు తెలియని 65ఏళ్ల వ్యక్తి చనిపోయి ఉన్నాడు. మృతుని వద్ద ఎలాంటి అధారాలు లేవు. లేత ఆకుపచ్చ కలర్ టీషర్ట్, తెలుపు ధోతి ధరించి, చేతి కర్రతో ఉన్నాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. ఎవరైనా తెలిసినవారుంటే 9949304574, 8712658604 నంబర్‌ను సంప్రదించాలని సూచించాడు.
కోనరావుపేట(వేములవాడ): సెల్‌టవర్ పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని మామిడిపల్లిలో విషాదం నింపింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన గుమ్మడి దేవయ్య–సరవ్వ కుమారుడు బాబు(32) కొన్నాళ్ల క్రితం గల్ఫ్ వెళ్లి దసరా పండుగకు ముందు స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలోనే ఉంటున్న బాబు బుధవారం రాత్రి ఎన్గల్‌కు వెళ్లే దారిలోని టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న భార్య, గ్రామస్తులు టవర్ ఎక్కి కాపాడే ప్రయత్నం చేస్తుండగానే పై నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. కాగా గతంలో కూడా పలుమార్లు టవర్‌పైకి ఎక్కి ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. మృతునికి భార్య ప్రవళిక, కుమారుడు, కూతురు ఉన్నారు.
జర్మనీలో నర్సింగ్ కోర్సు
విద్యానగర్(కరీంనగర్): జర్మనీలో ఆరోగ్య సంరక్షణ కార్మికులకు, నర్సులకు అధిక డిమాండ్ ఉన్నందున అక్కడ నర్సింగ్ మూడేళ్ల ఇంటర్నేషనల్ డిగ్రీ చదవడానికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ అవకాశం కల్పిస్తోందని, జిల్లా ఉపాధి కల్పనాధికారి వై.తిరుపతి రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చదువుకునే సమయంలో మూడేళ్లపాటు రూ.లక్ష స్టైఫండ్, నర్సుగా నెలకు రూ.3లక్షల వరకు వేతనం పొందే అవకాశం ఉందన్నారు. ఇంటర్‌లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది, 18 నుంచి 28 ఏళ్లోపు వయసువారు అర్హులని, ఎంపికై న అభ్యర్థులను జర్మనీకి పంపించే ముందు హైదరాబాద్‌లో జర్మన్ భాషలో తొమ్మిది నెలల పాటు రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలపారు. ఆసక్తి ఉన్నవారు 63022 92450, 94400 51763 నంబర్లలో సంప్రదించాలని, అభ్యర్ధులు తమ రెజ్యూమ్‌ను tomcom. recruitment manager@gmail.comకు ఈనెల 30లోగా పంపాలని సూచించారు.
వీడియో వైరల్‌పై సీరియస్
వేములవాడ: రాజన్న ప్రసాదాల ప్రధాన గోదాంలో నుంచి ఓ ఉద్యోగి సరుకులు తరలిస్తున్నట్లు ఉన్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ సీరియస్‌గా పరిగణించింది. ఆలయ ఈవో రమాదేవి, ఏఈవోలు, ఇతర అధికారులు భీమేశ్వర సదన్‌లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో కనిపించిన ఉద్యోగులను వేర్వేరుగా విచారించగా.. ఆలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఉద్దేశ్యపూర్వకంగానే ఇద్దరు ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో ఈ వీడియో రికార్డింగ్ చేయించినట్లు సీసీ కెమెరా ఫుటేజీల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి సదరు ఉద్యోగి తనని తాను రక్షించుకునేందుకు పైరవీలు మొదలుపెట్టినట్లు ప్రచారంలో ఉంది. గోదాంలోని అధికారి.. సిబ్బందిని విధులు సరిగ్గా నిర్వహించాలని ఆదేశించినందుకే ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. వీడియో రికార్డింగ్ చేయించిన ఉద్యోగిపై త్వరలోనే శాఖాపరమైన చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గోదాంలోని సరుకులు పక్కదారి పట్టకుండా ఇక నుంచి ప్రతీ 15 రోజులకోసారి తూకం వేసి లెక్కలు చూడాలని ఈవో రమాదేవి ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
గంభీరావుపేట(సిరిసిల్ల): ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ పోటీల్లో విజేతగా రాజన్నసిరిసిల్ల జిల్లా జట్లు నిలిచాయి. గంభీరావుపేట మండలం కొ త్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం ఉమ్మడి జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్‌లకు చెందిన 8 జట్లు పాల్గొన్నాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. బాలురు, బాలికల విభాగాల్లో రాజన్న సిరిసిల్ల జట్లు ప్రథమ, కరీంనగర్ జట్లు ద్వితీయ స్థా నాల్లో నిలిచాయి. విజేతలకు స్థానిక నాయకుడు దమ్మ శ్రీనివాస్‌రెడ్డి బహుమతులను అందించారు. షాదుల్, మల్లేశం భోజన వసతి కల్పించారు. పీడీ భార భాను, ఎంఈవో గంగారాం, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్, అశోక్, సుమన్, కృష్ణహరి పాల్గొన్నారు.

శతాధిక వృద్ధురాలు మృతి