
ఉపాధిహామీని సద్వినియోగం చేసుకోండి
● అర్హులకే రాజీవ్ యువవికాసం యూనిట్లు ● కాలువలో పూడికతీత పనులు చేపట్టాలి ● అధికారులకు కలెక్టర్ శ్రీహర్ష ఆదేశాలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఉపాధిహామీ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్‌లో బుధ వారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. జాబ్‌కార్డులు పొందిన కూలీలకు పనులు కల్పించాలన్నారు. జిల్లాలో ని సాగునీటి కాలువలు, నీటిపారుదల శాఖ పరిధిలోని చెరువులు, లిఫ్ట్ ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని అన్నారు. చెత్త, పిచ్చిమొక్కలను తొలగించాలని పేర్కొన్నారు. రాజీవ్ యువవికాసం పథకం కింద స్వయం ఉపాధి యూనిట్లను జూన్ 2 నాటికి అందిస్తామని ఆయన తెలిపారు. అర్హుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతో తుదిజాబితా సిద్ధం చేయాలని అన్నారు. డీఆర్డీవో కాళిందిని, సీఈవో నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
వైద్యులకు కలెక్టర్ అభినందన
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో క్లిష్టమైన ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తున్న వైద్యబృందంతోపాటు సూపరింటెండెంట్ శ్రీధర్‌ను కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. గర్భసంచిలోని గడ్డను శస్త్రచికిత్స ద్వారా వైద్యులు ఇటీవల తొలగించారు. ఇలా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కష్టతరమైన వైద్యసేవలను అందించడంతోపాటు శస్త్రచికిత్సలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.