
రాఘవాపూర్‌లో ధాన్యంపై టార్పాలిన్ కప్పుతున్న రైతు
● కొంత ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో.. మరికొంత కల్లాల్లో ● జిల్లాలో అంతంతమాత్రంగానే కొనుగోళ్లు ● తూకం ఆలస్యమవుతోందని రైతుల ఆరోపణ ● దళారులకు అమ్ముకోవడం మేలని ఆవేదన
పెద్దపల్లిరూరల్/మంథని: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. కొన్నిచోట్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉండగా.. కొంతమంది రైతులకు చెందిన ధాన్యం కల్లాల్లోనే ఉంది. తుపాన్ ప్రభావంతో మబ్బులు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం అక్కడక్కడ చినుకులు రాలడంతో ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పేందుకు ఆరాటపడ్డారు. ధాన్యం తడిస్తే రంగుమారి, నష్టం జరుగుతుందని వాపోతున్నారు. మంగళవారం జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనతో వారి గుండెల్లో గుబులు నెలకొంది.
307 కొనుగోలు కేంద్రాలు..
పెద్దపల్లి జిల్లాలో 307 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 273 కేంద్రాల్లో ధాన్యం తూకం వేస్తున్నారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో 203, ఐకేపీ ఆధ్వర్యంలో 52, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 18 కేంద్రాల్లో కొనుగోళ్లు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
4.90 లక్షల మెట్రిక్ టన్నులు అంచనా
జిల్లాలోని 14 మండలాల్లో 2,01,408 ఎకరాల్లో వరి సాగైందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఈసారి 4.90 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనాకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.236.33 కోట్ల విలువైన 1,07,313 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 16,988 మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశామన్నారు. వీరిలో 9,869 మందికి రూ.131.14 కోట్లు చెల్లించామని తెలిపారు.
నిబంధనల పేరుతో ఇబ్బందులు
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. చెత్తాచెదారం, మట్టిపెల్లలు ఉన్నాయని, తేమ శాతం రావడం లేదన్న కారణాలతో కొనుగోలు జాప్యం చేస్తున్నారని వాపోతున్నారు. కొన్నిచోట్ల టార్పాలిన్లు అందుబాటులో ఉండటం లేదని అంటున్నారు. ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చి, ఇబ్బందులు పడటం కన్నా దళారులకు కళ్లాల వద్దే అమ్ముకోవడం నయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడే అవకాశం ఉందని, త్వరగా కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
పెరిగిన మద్దతు ధర
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యానికి మద్దతు ధర పెంచగా ఈ సీజన్ నుంచే అమలులోకి వచ్చింది. గతేడాదితో పోలిస్తే క్వింటాల్‌కు రూ.143 చొప్పున పెంచింది. గతంలో సాధారణ రకం పంటకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,040 ఉండగా, ఇప్పుడు రూ.2,183కు పెరిగింది. ఏ–గ్రేడ్ రకం ధాన్యానికి గతంలో రూ.2,060 ఉండగా ఇప్పుడు రూ.2,203కు పెంచినట్లు అధికారులు తెలిపారు.
ఇబ్బందుల్లేకుండా కొనుగోలు
రైతులు తెచ్చిన ఽనాణ్యమైన ధాన్యాన్ని ఇబ్బందుల్లేకుండా కొనుగోలు చేస్తున్నాం. మట్టిపెల్లలు, తాలు ఉంటే శుభ్రం చేయించేందుకు అవసరమైన ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచాం. వర్షం కురిసినా ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైనన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయి.
– దేవరాజ్ పృథ్వీరాజ్, మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి, పెద్దపల్లి
ప్రతీసారి ఇదే పరిస్థితి
పంట కల్లాల్లో ఉన్నప్పుడే వర్షం పడుతోంది. ప్రతీసారి ఇదే పరిస్థితి. నేను పోయినసారి ధాన్యాన్ని మార్కెట్‌కు తరలిస్తే 10 బస్తాల వరకు కొట్టుకుపోయింది. ఈసారి మళ్లీ ఎక్కడ నష్టం జరుగుతుందోనని భయంగా ఉంది.
– కొట్టె సంపత్, రైతు, మంథని
ఈ చిత్రంలో వడ్లు కుప్ప చేస్తూ కనిపిస్తున్న మహిళా రైతు పేరు పంబాల రాజేశ్వరి. మంథని మండలంలోని ఖానాపూర్‌లో ఈమెకు ఎకరం పొలం ఉంది. నాలుగు రోజుల క్రితం మంథని వ్యవసాయ మార్కెట్‌కు వడ్లు తీసుకువచ్చింది. అప్పటినుంచి నిత్యం ఆరబెడుతోంది. వాన వచ్చేలా ఉందని, తూకం పూర్తవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. పోయిన యాసంగిలో ఇలాగే చెడగొట్టు వాన వచ్చి, పది బస్తాల ధాన్యం కొట్టుకుపోయి, నష్టం జరిగిందని వాపోయింది. ఇది ఈమె ఒక్కరి పరిస్థితే కాదు.. చాలా మంది రైతులది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు.

మంథనిలో ధాన్యం తింటున్న మేకలు

