
మంథని: మంథని నియోజకవర్గంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. గతంలో మాదిరిగానే ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. కానీ, ఇది ఎవరికి లాభం కలిగిస్తుంది, మరెవరికి నష్టం కలిగిస్తుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. విలక్షణమైన తీర్పునిచ్చే ఓటర్లలో వచ్చినమార్పు ఏ అభ్యర్థిని అందలం ఎక్కిస్తుంది, ఎవరికి చేదు అనుభవం మిగుల్చుతుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. 2018 అసెంబ్లీ పోరులో 85.41 పోలింగ్ నమోదుదై జిల్లాలోనే రికార్డు నెలకొల్పింది. ఈసారి కూడా మొదటిస్థానంలో నిలిచి 82.74 శాతంగా నమోదైంది. ఇది గతం కంటే 2.67శాతం తక్కువ.
2009లో 74.63శాతం..
2009 అసెంబ్లీ ఎన్నికల్లో 74.63 శాతం పోలింగ్ నమోదు కాగా, 2014లో 81.2 శాతంతో ఉమ్మడి జిల్లాలోనే మంథని మొదటి స్థానంలో నిలిచింది. పెద్దపల్లిలో 81.57శాతం, రామగుండంలో 68.71 శాతం పోలింగ్ నమోదు కాగా, మంథనిలో 82.57 శాతం పోలింగ్ నమోదై అగ్రస్థానంలో నిలిచింది. మంథనిలో మొత్తం 2,36,422 మంది ఓటర్లకు 1,95,6355 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. గ్రామీణుల్లో అంతగా చైతన్యం ఉండదని భావించినా.. అందరి అంచనాలు తారుమారు చేస్తూ పల్లెఓటర్లే అత్యధిక మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల కమిషన్ చైతన్యం చేయడంతోనే ఇదిసాధ్యమని భావిస్తున్నారు.
సరిహద్దు మండలాల్లో..
సరిహద్దు మారుమూల పలిమె మండలంలో అత్యధికంగా 90.82 శాతం పోలింగ్ నమోదైంది. రామగిరి మండలంలో అత్యల్పంగా 75.18శాతం నమోదైంది. మహాముత్తారంలో 87.95శాతం, మహదేవపూర్, మల్హర్‌లో 84.18 శాతం, ముత్తారంలో 83.02శాతం, కాటారంలో 81.88శాతం, కమాన్‌పూర్‌లో 84.98శాతం, పాలకుర్తి(రెండు గ్రామాలు)లో 77.77శాతం, మంథనిలో 83.54శాతం పోలింగ్ నమోదైంది.
ఆశలన్నీ మంథని, కమాన్‌పూర్‌పైనే..
వివిధ పార్టీల అభ్యర్థుల ఆశలన్నీ మంథని, ఉమ్మడి కమాన్‌పూర్ మండలాలపైనే ఉంటాయి. ఈసారి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. గెలుపుపై ఎవరి ధీమా వారేవ్యక్తం చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో 2,06,715 మంది ఓటర్లకు 1,75,995 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈసారి 2,36,442 మంది ఓటర్లకు 1,95,635 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. గతంతో పోల్చితే ఓటింగ్ వినియోగించుకున్న వారి సంఖ్య 20 వేలకు పెరిగింగి. ఓటింగ్‌శాతం కాస్త తగ్గినా.. ఓటుహక్కు వినియోగించుకున్నవారు అదికంగా ఉండడంతో ఏ అభ్యర్థికి మేలు చేస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.