న్యూస్‌రీల్
ఒకే పడకపై ఇద్దరు రోగులు
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026
● ప్రధాన ఆస్పత్రుల్లో కానరాని సౌకర్యాలు
● సిబ్బంది కొరత తీవ్రం
● రోగులకు అందని సేవలు
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్/కురుపాం/పాలకొండ/పాలకొండ రూరల్/సాలూరు:
వాతావరణంలో మార్పులు..తీవ్రమైన వడగాడ్పులు, భరించలేని ఎండ..గ్రామాలు, పట్టణాల్లో వరుస పండగలు..పారిశుద్ధ్య లోపం.. రోగాలు, జ్వరాలు దాడులు చేయడానికి ఇలా అన్నీ కలిసి వస్తున్నాయి. ప్రస్తుతం జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. వైరల్ ఫీవర్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. అక్కడేమో సౌకర్యాలు, వైద్యసేవలు అందక రోగులకు అవస్థలు మిగులుతున్నాయి.
జిల్లా ఆస్పత్రి..సామర్థ్యానికి మించి
జిల్లా కేంద్రాస్పత్రిపై రోగుల భారం పరిమితికి మించి పెరుగుతోంది. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న పడకల కంటే చికిత్స పొందుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. మొత్తం 172 పడకల (150 సాధారణ, 10 ఎన్.ఆర్.సి, 12 ఎస్.ఎన్.సి.యు) సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో, ప్రస్తుతం వివిధ విభాగాల్లో కలిపి 237 మంది ఇన్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఇది నిర్ణీత సామర్థ్యం కంటే సుమారు 37 శాతం అదనపు భారం కావడం గమనార్హం.
ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లోనూ రోగుల తాకిడి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ‘సాక్షి‘ పరిశీలన సమయానికి మాతా శిశు సంరక్షణ (ఓబీజీ) విభాగంలో అత్యధికంగా 89 మంది రోగులు ఉన్నారు. జనరల్ మెడిసిన్ విభాగంలో 47 మంది, సర్జరీలో 29 మంది, పిడియాట్రిక్ విభాగంలో 28 మంది చికిత్స పొందుతున్నారు. శిశు మరణాల నివారణ కేంద్రం (ఎస్‌ఎన్‌సీయూ) లో 17 మంది, పోషకాహార పునరావాస కేంద్రం(ఎన్‌ఆర్సీ)లో 9 మంది చిన్నారులు ఉన్నారు.
రోగుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది లభ్యత లేకపోవడంతో, ఆస్పత్రిలో నర్సింగ్ విద్యార్థుల సేవలు కీలకంగా మారాయి. సాధారణ సిబ్బంది కంటే శిక్షణలో ఉన్న విద్యార్థులే వార్డుల్లో అధికంగా కనిపిస్తున్నారు. మందుల సరఫరా, రోగులకు ఇంజక్షన్లు ఇవ్వడం, ఓపీ స్లిప్పుల నమోదు వంటి కీలకమైన పనుల్లో వారే కనిపిస్తున్నారు.
రేడియాలజీ, మైక్రోబయాలజీ వంటి కొన్ని ప్రధాన విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న వనరులు, విద్యార్థుల సహాయంతోనే ప్రస్తుత వైద్య సేవలు కొనసాగుతున్నాయి..
సాలూరులో ఇటీవల నూతనంగా ఏరియా ఆస్పత్రి ప్రారంభించినప్పటికీ..మౌలిక వసతుల లేమి కనిపిస్తోంది. ఇటీవల ఓ క్షతగాత్రుడికి అత్యవసర వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడగా.. ఆస్పత్రిలో సీటీ స్కాన్ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో విజయనగరానికి రిఫర్ చేశారు. పూర్తిగా పనులు జరగకుండానే ఆస్పత్రి ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఇప్పటివరకు వినియోగంలోకి రాలేదు. అధికార పార్టీ గొప్పల కోసం పనులు పూర్తి కాకముందే ఆస్పత్రిని ప్రారంభించారన్న విమర్శలు ఉన్నాయి.
కురుపాం నియోజక కేంద్రంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం కొమరాడ మండలాల నుంచి అధిక సంఖ్యలో రోగులు వివిధ సమస్యలతో ఆశ్రయిస్తుంటారు. రోగులకు సరిపడా పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఇక్కడ లేవు. ఒకే పడకపై ఇద్దరు రోగులు చొప్పున చికిత్స పొందడం పరిపాటిగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అదనపు భవనాల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం నేటికీ వాటిని అందుబాటులోకి తీసుకురాకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు


