అదనపు సాయం ప్రకటించి.. లక్షణంగా పక్కన పెట్టి..! | - | Sakshi
Sakshi News home page

అదనపు సాయం ప్రకటించి.. లక్షణంగా పక్కన పెట్టి..!

May 4 2026 7:31 AM | Updated on May 4 2026 7:31 AM

అదనపు సాయం ప్రకటించి.. లక్షణంగా పక్కన పెట్టి..! అదనపు సాయం వెంటనే ప్రకటించాలి

అదనపు నిధులు విడుదల కావాల్సి ఉంది

నిజంగా నిద్రపోయే వారిని నిద్ర నుంచి ఎవరైనా లేపగలరు. దొంగ నిద్ర నటించే వారిని నిద్ర లేపడం ఎవరి తరమూ కాదన్నట్లుంది ప్రభుత్వం తీరు. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలకు సొంతగూడు కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం నిధులు సమకూర్చినప్పటికీ అదనపు సాయం చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడంలో గిరిజనులకు మొండిచేయి చూపుతోంది.

సీతంపేట: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి పక్కా గృహాలు లేని పీవీటీజీ (పర్టికులర్లీ వలనర్‌బుల్‌ ట్రైబ్‌గ్రూప్‌)లకు ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం చర్యలు తీసుకుంది. పీఎం జన్‌మాన్‌ పథకం పేరిట కేంద్ర ప్రభుత్వం ఒక్కో గృహానికి రూ.2.39 లక్షలు అందిస్తుంది. మూడు విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమచేస్తుంది. చంద్రబాబు సర్కార్‌ కూడా దానికి అదనంగా రూ.లక్ష అదనపు సాయం మంజూరు చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి 2024 డిసెంబర్‌ 10వ తేదీన జీవో కూడా జారీ చేశారు. గిరిజనులు ఎంతో ఆశతో ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని ఆశించారు. వారి ఆశలు ఎదురు చూపులు గానే మిగిలాయి. ఏడాదిన్నర గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఒక్కపైసా కూడా అదనపు నిధులు విడుదల చేయలేదు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 1748 ఇళ్లు మంజూరయ్యాయి. కేవలం 233 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులు పూర్తి చేశారు. 336 మంది పునాదులు నిర్మించారు. రూఫ్‌ లెవెల్‌ 450 మంది లబ్ధిదారులు నిర్మించారు. శ్లాబ్‌ స్థాయి 361 మంది ఉన్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభించిన వారు 368 మంది ఉన్నారు. ఒక్కో ఇంటికి పునాదులు వరకు నిర్మిస్తే రూ.70 వేలు, రూఫ్‌ స్థాయిలో రూ.90 వేలు, శ్లాబ్‌ నిర్మిస్తే రూ.40 వేలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ రూ.27 వేలు, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు చెల్తించాల్సి ఉంది.

ఆర్థిక ఇబ్బందుల్లో ఆదివాసీలు..

రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష సాయం అందిస్తామని జీవో జారీ చేయడంతో పీఎం జన్‌మాన్‌ పథకంలో గృహ లబ్ధిదారులైన ఆదివాసీలు ఎంతో ఆనందించారు. ఇంటి నిర్మాణం ఉత్సాహంగా ప్రారంభించారు. ఇప్పుడు ఆ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కానీ కూటమి సర్కారు మాట నిలుపుకోకపోవడంతో గిరిజనులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. యుద్ధ ప్రభావంతో నిర్మాణ సామగ్రి అయిన ఇసుక, సిమ్మెంట్‌, ఇటుక, చిప్స్‌, ఇనుము ధరలు ఆకాశన్నంటుతున్నాయి. అలాగే కూలీల ఖర్చులు పెరగడంతో కేంద్రం ఇచ్చే ప్రోత్సాహక నిధులు ఎటూ సరిపోక పోవడంతో ఇంటినిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి ఉందని గిరిజనులు చెబుతున్నారు.

ఆదివాసీలు నిర్మించుకునే ఇళ్లకు ప్రస్తుతం ఇస్తున్న నిధులు ఎటూ సరిపోవడం లేదు. అదనపు సాయం చేస్తామని జీవో జారీ చేసి ఇంతవరకు ఆ విషయం పట్టించుకోకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. వెంటనే ఆదనపు ఆర్థికసాయం అందించాలి. కొన్ని చోట్ల లబ్ధిదారులకు సాధారణ బిల్లులు కూడా ఇళ్లు నిర్మించిన వాటికి చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటికై నా పూర్తిస్థాయిలో గిరిజనులకు ఆర్థికసాయం అందేలా చూడాలి.

విశ్వాసరాయి కళావతి,

పాలకొండ మాజీ ఎమ్మెల్యే

హౌసింగ్‌ లబ్ధిదారులకు ప్రోత్సాహం ప్రకటించి విడుదల చేయని ప్రభుత్వం

జీవో జారీ చేసి ఏడాదిన్నరైనా విడుదల కాని నిధులు

గిరిజనులకు మిగులుతున్న ఎదురుచూపులు

ముందుకు సాగని ఇళ్లనిర్మాణం

అదనపు సాయం నిధులు ఇంకా రావాల్సి ఉంది. మంజూరైన వెంటనే బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు గిరిజనులు వివిధ దశల్లో నిర్మించిన ఇళ్లకు బిల్లులు చెల్లిస్తున్నాం. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి.

సీహెచ్‌.వెంకటేష్‌, హౌసింగ్‌ ఏఈ, సీతంపేట

Advertisement
 
Advertisement
Advertisement