మీకోసం వెబ్‌సైట్‌లో పీజీఆర్‌ఎస్‌ అర్జీల నమోదు | - | Sakshi
Sakshi News home page

మీకోసం వెబ్‌సైట్‌లో పీజీఆర్‌ఎస్‌ అర్జీల నమోదు

May 4 2026 7:31 AM | Updated on May 4 2026 7:31 AM

మరణంలోనూ ఒక్కటిగా... వీడని దాంపత్య బంధం ● నాలుగు గంటల వ్యవధిలో భార్యాభర్తల మృతి

పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కారవేదికలో(పీజీఆర్‌ఎస్‌) అర్జీల వివరాల మీకోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చునని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకర రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని కార్యాలయల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించనున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో ప్రతిరోజూ వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక సెల్లార్‌ను ఏర్పాటుచేశామన్నారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో అర్జీలు నదు చేసుకోవచ్చునన్నారు. అర్జీల స్థితిని 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చునని తెలిపారు.

పారిశుధ్య కార్మికులకు నేడు మెగా మెడికల్‌ క్యాంప్‌

పార్వతీపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల కోసం మే 4న సోమవారం మెగా మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ డా. ఎన్‌. ప్రభాకర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో మెగా వైద్యశిబిరం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందన్నారు. శిబిరంలో నిపుణులైన వైద్యులతో పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేయనున్నారన్నారు. పారిశుధ్య కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

కదలని ఏనుగులు

గరుగుబిల్లి: గడిచిన పదిరోజుల నుంచి ఏనుగులు ఈ ప్రాంతంనుంచి కదలకపోవడంతో ప్రజలు భీతిల్లుతున్నారు. గరుగుబిల్లి మండలంలోని నందివానివలస, తోటపల్లి, ఖడ్గవలస, నాగూరు తదితర గ్రామాల్లో ఏనుగులు సంచరించి పలు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. అయితే మండలంనుంచి ఏనుగులు వెళ్లకపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులనుంచి తోటపల్లి, నందివానివలస, గిజబ గ్రామాలలో సంచరిస్తున్న ఏనుగులు తాజాగా ఆదివారం నందివానివలసలోని పంట పొలాల్లో దర్శనమిచ్చాయి. ప్రస్తుతం పొలంలో అరటి, పామాయిల్‌, మొక్కజొన్న, వేరుశనగ తదితర పంటలు ఉండడంతో ఎప్పుడు ఏ పంటలకు నష్టం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

తెర్లాం: మూడుముళ్ల బంధం... ఏడడుగుల అనుబంధం... జన్మజన్మలకు తీరని రుణానుబంధం...అదే దాంపత్య బంధం. పెద్దలు చెప్పినట్టుగానే ఆ దంపతులు మరణంలోనూ బంధాన్ని వీడలేదు. అనారోగ్యంతో ఒక్కటిగా చనిపోయారు. అదీ ఆదివారం గంటల వ్యవధిలోనే... ఈ ఘటన తెర్లాం మండలం గొలుగువలసలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే...గొలుగువలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు సాకేటి రామకృష్ణ(65), సింహచలం(60) ఆదివారం కొన్ని గంటల వ్యవధిలోనే మరణించారు. వీరిరువురు 40 సంవత్సరాలుగా దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో ఒకరికొకరు తోడునీడగా ఉన్నారు. కొద్ది రోజులు కిందట వీరిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం వారం రోజుల కిందట శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆస్పత్రికి బంధువులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామకృష్ణ భార్య సింహాచలం మృతి చెందింది. ఈ క్రమంలో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామకృష్ణ ఆరోగ్యం కొద్దిగా మెరుగు పడడంతో ఆయనను సొంత గ్రామమైన గొలుగువలసకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి రామకృష్ణను ఆటోలో తీసుకువస్తుండగా భార్య సింహాచలం మరణించిందని తెలియడంతో మార్గమధ్యలోనే ఆయన కూడా మరణించాడు. భార్యాభర్తలిద్దరూ నాలుగు గంటల వ్యవధిలోనే మృతి చెందారన్న విషయం గ్రామస్తులకు తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నలభై ఏళ్లుగా ఒక్కటిగా కలసిమెలసి దాంపత్య జీవనం సాగించిన ఇద్దరూ మరణంలోనూ ఆ బంధాన్ని వీడలేదని బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement