● తాగునీటికి ఆదివాసీల విలవిల
భామిని: వేసవి తాపంతో అల్లాడుతున్న తరుణంలో తాగునీటి కోసం భామిని మండలంలోని కోటకొండ, కోసింగూడ ఆదివాసీ గ్రామాల గిరిజనులు అల్లాడుతున్నారు. తివ్వాకొండల పైకి నీరు అందించే మినీరక్షిత నీటి పథకాలు మరుగున పడడంతో తాగునీరు లేక ఆదివాసీలు నానా అవస్థలు పడుతున్నారు. రోజువారీ అవసరాలకు, తాగడానికి సుమారు మూడు కిలోమీటర్లు కొండ దిగి నూతి నుంచి నీరు తెచ్చుకుంటున్నామని గిరిజనులు వాపోతున్నారు. నూతిలో ఊట కోసం పడిగాపులు పడుతున్నట్లు విలపిస్తున్నారు. తాము తాగునీటి కోసం పడుతున్న శ్రమను అధికారులు గుర్తించి తాగునీటి సమస్యను వెంటనే తీర్చాలని అధికారులను వేడుకుంటున్నారు. గర్భిణులు, వృద్ధులు నీరు తెచ్చుకోలేక నానా అవస్థలు పడుతున్నాయని వాపోతున్నారు.
గొంతు తడుపుకోవడానికి మూడు కిలోమీటర్లు కొండ దిగి నూతి నీరు తెచ్చుకోవలసి వస్తోంది. వృద్ధులు.గర్భిణులు నానా అవస్థలు పడుతున్నారు. నూతి దగ్గర గంటల కొద్దీ పడిగాపులు పడుతూ నీరు తోడుతున్నాం. మాకు నీటి బాధలు తప్పించాలి.
–ఆరికి రాణి,
ఆదివాసీ గిరిజన యువతి, కోటకొండ


