పాలకొండ: పాలకొండ సబ్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో గ్రామీణ ప్రాంత ప్రజలకు విద్యుత్ కష్టాలు తీరలేదు. శుక్రవారం మధ్యాహ్నం వీచిన గాలివాన కారణంగా నిలిచిన విద్యుత్ సరఫరా ఆదివారం నాటికి పునరుద్ధరణ జరగలేదు. శనివారం రాత్రికి నగర పంచాయతీలో పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేసిన అధికారులు గ్రామీణ ప్రాంతాలకు మాత్రం ఆదివారం రాత్రి వరకు విద్యుత్ అందించలేదు. ప్రధానంగా సీతంపేట ఫీడర్ పరిధిలోని సింగన్నవలస, పరశురాంపురం, వెలగవాడ, సిరికొండ, రుద్రిపేట తదితర గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి.
మూడు రోజులపాటు కరెంటు సరఫరా లేకపోవడంపై గ్రామీణ ప్రాంతాల ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు కనీసం ఫిర్యాదులకు కూడా అందుబాటులో లేరని ఆరోపిస్తున్నారు. రాత్రి సమయాల్లో విద్యుత్ లేని కారణంగా జాగారం చేస్తున్నామని వాపోతున్నారు. ఈ విషయమై విద్యుత్ శాఖ ఏఈ యోగి వద్ద ప్రస్తావించగా మరమ్మతు పనులు జరుగుతున్నాయని తెలిపారు. మరో రోజులో గ్రామీణ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు.


