ప్రశాంతంగా ముగిసిన ‘నీట్‌’ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ముగిసిన ‘నీట్‌’

May 4 2026 7:31 AM | Updated on May 4 2026 7:31 AM

విజయనగరం అర్బన్‌: జిల్లాలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల ప్రవేశ పరీక్ష నీట్‌–యూజీ 2026 ఆదివారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,824 మంది అభ్యర్థులు నమోదు చసుకోగా 1,790 మంది హాజరై పరీక్ష రాశారు. 34 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. పరీక్ష నిర్వహణను పర్యవేక్షించేందుకు నియమితులైన జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (నోడల్‌ అధికారి) సేతు మాధవన్‌ పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్‌, విద్యాశాఖ సహా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసినట్లు అధికారులు తెలిపారు.

గోడకూలి ఇద్దరికి గాయాలు

సీతానగరం: మండలంలోని తామరఖండి గ్రామంలో ఇంటిపని చేస్తుండగా ఆదివారం గోడకూలి ఇద్దరు మేసీ్త్రలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తామరఖండిలో బొంగు తవిటినాయుడు ఇంటిపనికి బొబ్బిలికి చెందిన కర్రి సింహాచలం, కర్రి లక్ష్మణ వచ్చారు. ఆదివారం ఉదయం పని ప్రారంభించి పాత ఇంటి గోడల మధ్య కాలమ్స్‌ కడుతుండగా ఆదేఇంటికి సంబంధించిన పాతగోడ కూలి పోయి ఇటుక బెడ్డలు ఆ ఇద్దరిపై పడడం వల్ల గాయాలయ్యాయి. క్షతగాత్రులు సింహాచలం, లక్ష్మణలను 108 వాహనంలో చికిత్సనిమిత్తం పార్వతీపురం జిల్లాకేంద్రాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సింహాచలం పరిస్థితి విషమించడంతో విజయనగరం మహరాజా ఆస్పత్రికి తరలించగా లక్ష్మ ణ పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కీసరలో ఏనుగుల విధ్వంసం

భామిని: మండలంలోని కీసరలో నాలుగు ఏనుగులు ఆదివారం పంటలు ధ్వంసం చేసి నష్టంకలిగించాయని రైతులు వాపోతున్నారు. ఏనుగులు గతంలో మొక్కజొన్న పంటనే తినివేసేవి. ప్రస్తుతం రైతులు ఆలుగాలం శ్రమించి పండించి ఆరబెట్టిన మొక్కజొన్న గింజలపై ప్రతాపం చూపాయి. గ్రామం చుట్టూ ఆరబెట్టిన మొక్కజొన్న కళ్లాల్లో విచ్చల విడిగా తిరుగాడుతూ ఆరబెట్టిన గింజలను ధ్వంసం చేసి బస్తాల్లో కుట్టిన మొక్కజొన్న గింజలను పాడు చేశాయి. జొన్న గింజల బస్తాలను నాలుగు పక్కలను విసిరివేస్తూ పాడు చేశాయి. పంటలు ఇంటికి చేరే సమయంలో ఏనుగులు విధ్వంసం చేయడాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు.

అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య

విజయనగరం క్రైమ్‌: స్థానిక తోటపాలెం నివాసి బూర రాము (44) తన కంపెనీలో ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి రూరల్‌ ఎస్సై అశోక్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వీటీ అగ్రహారంలో సిల్వర్‌ గిన్నెల కంపెనీ నడుపుతున్న రాము మొదటి భార్య మృతి చెందగా, రెండో భార్య సంధ్య, ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడు. కంపెనీ కోసమని రూ.యాభై లక్షల వరకు అప్పు చేశాడు. అయితే కంపెనీ టర్నోవర్‌లో తీవ్ర నష్టం రావడం, తీసుకున్న అప్పులు సకాలంలో కట్టలేకపోవడంతో మనస్తాపం చెంది కంపెనీలోనే రాడ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అశోక్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement