పరిహారం.. పరిహాసం..! | - | Sakshi
Sakshi News home page

పరిహారం.. పరిహాసం..!

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

పరిహారం.. పరిహాసం..! కాయలన్నీ రాలిపోయాయి పంట నష్టం వివరాలు తెలియజేయండి చిల్లిగవ్వ పరిహారం రాలేదు

రైతన్నకు అందని పంట నష్టపరిహారం

విపత్తుల వేళ పంటలు కోల్పోయినా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

ఎందుకీ ‘పచ్చ’పాతం అంటూ ఆవేదన

వీరఘట్టం:

● గతేడాది ఖరీఫ్‌లో సంభవించిన మోంథా తుఫాన్‌ రైతన్నను నిలువునా ముంచేసింది. అపార పంట నష్టం కలిగించింది. ప్రభుత్వం నుంచి పైసా పరిహారం అందలేదు.

● ఇటీవల ఈదురుగాలులతో కూడిన వానలు ఉద్యానవన పంటలు సాగుచేసిన రైతుల నడ్డి విరిచాయి. మొక్కజొన్నతో పాటు అరటి, బొప్పాయి, జీడిమామిడి, మామిడి పంటలకు నష్టం చేకూర్చాయి. రైతన్న ఆవేదన చెందుతున్నా పరిహారం అందుతుందన్న ధీమా లేదు. ఆదుకుంటారన్న నమ్మకం కలగడంలేదు.

రైతు సంక్షేమమే లక్ష్యమంటూ ఎన్నికల్లో గొప్పలు చెప్పిన కూటమినేతలు ఓట్లు దండుకున్నాక మొఖం చాటేశారు. రైతన్న సాగు కష్టాలు ఎదుర్కొంటున్నా కనికరం చూపడం లేదు. గిట్టుబాటు ధరతో పాటు విపత్తుల వేళ ఆదుకునేదిశగా కనీస చర్యలు తీసుకోవడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలుచేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసి బీమా ధీమా లేకుండా చేశారు. కొందరు రైతులు ప్రీమియం చెల్లించినా బీమా అందని పరిస్థితిని తీసుకొచ్చారు. చంద్రబాబు నోటివెంట తరచూ వచ్చే సాగుదండగన్న మాటను నిజంచేస్తున్నారని రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు.

పంటలు పాడైనా...

గతేడాది అక్టోబర్‌ నెలలో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులకు జిల్లా వ్యాప్తంగా సుమారు 6,250 ఎకరాల్లో అరటి పంటకు నష్టం జరిగినట్లు ఉద్యానవన శాఖ అధికారులు గుర్తించారు. అలాగే, గతేడాది అక్టోబర్‌ నెలాఖరులో సంభవించిన మోంథా తుఫాన్‌ జిల్లా రైతాంగానికి వణుకు పుట్టించింది. తుఫాన్‌ ప్రభావంతో వీచిన ఈదురు గాలులకు వేల ఎకరాల్లో పంటల నష్టం జరిగింది. అయితే అధికార యంత్రాంగం మాత్రం కేవలం 815 ఎకరాల్లో మాత్రమే అరటి, వరి, తదితర పంటకు నష్టం జరిగినట్లు పంటల నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. అయినా ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ కూడా పంట పరిహారం అందలేదు. అయితే, తుఫాన్‌కు వాతావరణశాఖ నామకరణం చేయలేదన్న సాకును చూపి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయకపోవడం గమనార్హం.

● శుక్రవారం ఈదురుగాలులు భయానకంగా వీచాయి. గాలుల ధాటికి మామిడి, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. వీరఘట్టం, పాలకొండ, సీతంపేట, భామిని, కురుపాం, మక్కువ, సాలూరు మండలాల్లో 10 వేల ఎకరాల్లో మామిడి పంట నేలమట్టమైందని రైతులు చెబుతున్నారు. జియ్యమ్మవలస, కురుపాం, గరుగుబిల్లి, వీరఘట్టం మండలాల్లో 1000 ఎకరాల్లో అరటి, 50 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఇంత జరిగినా ఆదుకునే చర్యలు కానరాకపోవడం రైతుల ను ఆవేదనకు గురిచేస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతును రాజుగా చూసేదని, సాగుకు అండగా నిలిచేదని గుర్తుచేసుకుంటున్నారు.

వీరఘట్టం మండలం అచ్చెపువలస సమీపంలో 1.5 ఎకరాల్లో మామిడి తోట ఉంది. మరో వారం రోజుల్లో కోత కోద్దామని అనుకున్నాను. ఇంతలో శుక్రవారం పెను ఈదురుగాలు వీయడంతో కాయలు మొత్తం రాలిపోయాయి. సుమారు రూ.80 వేలు ఆదాయం వస్తుందనుకున్నాను. కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఆదుకోవాలి.

– ఆరిక కామేశ్వరావు, రైతు, అచ్చెపువలస, వీరఘట్టం మండలం

50 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం

వీరఘట్టం, పాలకొండ మండలాల్లో 50 ఎకరాల మామిడి తోటలను రైతుల వద్ద కౌలుకు తీసుకున్నాను. శుక్రవారం వీచిన గాలులకు కాయలు మొత్తం రాలిపోయాయి. సుమారు రూ.3 లక్షల వరకు నష్టం వస్తుంది. అధికారులు పరిశీలించి ఆదుకోవాలి.

– సొండి అనీల్‌, మామిడి రైతు, వీరఘట్టం

పంటల నష్టం జరిగినప్పుడు బాధిత రైతులు సమీపంలో ఉన్న సచివాలయంలో తెలియజేయాలి. అప్పుడు అధికారులు వచ్చి జరిగిన పంటల నష్టాన్ని పరిశీలిస్తారు. తద్వారా పంటల నష్టం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం.

– సత్యన్నారాయణ రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖాధికారి, పార్వతీపురం మన్యం

గతేడాది వచ్చిన మోంథా తుఫాన్‌కు 3 ఎకరాల్లో క్యాబేజీ, 2 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. పంట నష్టం వివరాలను అధికారులకు తెలియజేశారు. వివరాలు అన్నీ రాసుకున్నారు. ఈ రోజు వరకు నాకు పంట నష్టం చిల్లిగవ్వ కూడా అందలేదు.

– కర్రి సింహాచలం, రైతు, వీరఘట్టం

Advertisement
 
Advertisement
Advertisement