గుమ్మలక్ష్మీపురం: ఎండగా ఉందని.. చల్లని శీతల పానీయం కోసం ఆశ పడతాం.. కాస్త నీరసంగా ఉందని మార్కెట్లో దొరికే ఎనర్జీ డ్రింకు వైపు చూస్తాం.. ఆకలిగా ఉందని, బాగా మసాలా దట్టించి.. ఘుమఘుమలాడే నాన్‌వెజ్ వంటకాన్ని ఆవురావురని తింటాం. ఇక్కడే ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నాం. ఏజెన్సీ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని వ్యాపారులు రెండు చేతులా వినియోగించుకుంటున్నారు. కాలం చెల్లిన కూల్ డ్రింకులను విక్రయించి, ఆరోగ్యంపై నిశ్శబ్దంగా దాడి చేస్తున్నారు. హోటళ్లలో రంగు కలిపిన ఆహార పదార్థాలను తినిపిస్తున్నారు. శనివారం గుమ్మలక్ష్మీపురం పరిధిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (డివిజన్ –1) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు దుకాణాల్లో గడువు ముగిసిన ఆహార పదార్ధాలు, కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించి, సంబంధిత వ్యాపారులపై అడ్యుడికేషన్ కేసు లు దాఖలు చేశారు. తనిఖీ బృందం గుమ్మలక్ష్మీపురంలోని ఏడు ప్రధాన వ్యాపార సంస్థలను పరిశీలించగా నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్యాంపా కోలా, పెప్సీ, థమ్సప్, 7 అప్ వంటి బ్రాండెడ్ కూల్ డ్రింక్స్‌తో పాటు ఎనర్జీ డ్రింక్స్ వందల సంఖ్యలో గడువు ముగిసినా విక్రయానికి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. బిర్యానీ పౌడర్, సాంబార్ పౌడర్, సోన్ పాపిడి వంటి ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు కూడా గడువు తేదీ దాటినట్లు నిర్ధారించారు. బుడంకాయల మదన్ కుమార్, పొట్నూరు సుందరరావు, బి.నాగరాజు, అందవరపు శ్రీనివాసరావు, డోకి శ్రీధర్, వెంకటకృష్ణ, చప్పా మాధవ నాయుడు అనే వ్యాపారుల షాపుల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. నిల్వలను సీజ్ చేసి, బాధ్యులపై కేసులు నమోదు చేశారు.
ప్రజారోగ్యంతో చెలగాటం
కాలం చెల్లిన శీతల పానీయాల విక్రయం
రంగు కలిపిన, నిల్వ ఉంచిన మాంసాహార పదార్థాలు
ఆహార భద్రతా విభాగం అధికారుల తనిఖీల్లో బట్టబయలు


