స్వామికి అపచారం.. ఎందుకంత నిర్లక్ష్యం? | - | Sakshi
Sakshi News home page

స్వామికి అపచారం.. ఎందుకంత నిర్లక్ష్యం?

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

ఆలయ అసలు విగ్రహాలను అలా పడేస్తారా..?

తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద స్వామి సేవకుల నిరసన

సాక్షి, పార్వతీపురం మన్యం/గరుగుబిల్లి: తోటపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అపచారం జరిగినా దేవదాయశాఖ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్వామివారి సేవకులు ప్రశ్నించారు. ఆలయంలో కొద్ది రోజులుగా చేపడుతున్న నిర్మాణ పనులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. స్వామి వారి విగ్రహాన్ని తొలగించి, నిర్లక్ష్యంగా రహదారి పక్కన రేకుల షెడ్డులో వదిలేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక బీజేపీ నేతలు ద్వారపురెడ్డి శ్రీనివాసరావుతో కలిసి శనివారం ఆలయం వద్ద నిరసన తెలిపారు. రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఆలయ చైర్మన్‌, ఈవోకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా.. వారు అందుబాటులోకి రాలేదు. దీంతో చాలాసేపు అక్కడే ధర్నా చేయడంతో అక్కడున్న ప్రైవేట్‌ ట్రస్టు సభ్యులు స్వామి సేవకులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ద్వారపురెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని చెప్పారు. కేంద్రం అందించే ఉపాధి నిధులతో కూడా ఇక్కడ పలు పనులు చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. స్వామి వారికి అపచారం చేయవద్దని తాము కోరుతున్నామన్నారు. అన్నవరం సత్యదేవుని ఆలయంలో మాదిరి.. ఇక్కడ కూడా కొత్త ప్రతిమలతో పాటు, పూర్వ విగ్రహాలను ముందు ప్రతిష్ఠించి నిత్య పూజలు అందేలా చేస్తామని అప్పట్లో చెప్పారని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా చేశారన్నారు.

భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా దేవదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని.. ట్రస్టు కార్యకలాపాలపై పర్యవేక్షణ చేయాలని కోరారు. కార్యక్రమంలో హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement