టేకు చెట్ల మాయం.. ఎవరి హస్తం? | - | Sakshi
Sakshi News home page

టేకు చెట్ల మాయం.. ఎవరి హస్తం?

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

టేకు చెట్ల మాయం.. ఎవరి హస్తం?

సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మండలంలోని అడారి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో టేకు చెట్ల మాయంపై ఎట్టకేలకు స్కూల్‌ హెచ్‌ఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 26న చెట్లు నరికివేసినట్లు.. ఫిర్యాదులో పేర్కొన్నారు. 12 చెట్లను ఐదుగురు వ్యక్తులు తొలగించినట్లు వారు చెబుతుండగా.. అంతకు మించి ఉంటాయని స్థానికులు అంటున్నారు. దీనిపై ఇటీవల ‘సాక్షి’లో ‘పాఠశాలలలో టేకు చెట్లు మాయం’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పార్వతీపురం ఇన్‌చార్జి తహసీల్దార్‌ సత్యనారాయణ పాఠశాలలో విచారణ చేపట్టారు. 14 చెట్లు కోతకు గురైనట్లు ఆయన చెబుతున్నారు. ఇందులో ఏది నిజం.. ఏది అబద్ధం అన్నది ప్రశ్నగా మారింది. అధికార పార్టీ నాయకుల ప్రమేయంతోనే చెట్లు నరికి వేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్న విషయం విదితమే. ఈ పరిస్థితుల్లో కేసు ఎంత వరకూ ముందుకు వెళ్తుందన్నది చూడాలి.

ఆస్పత్రి పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్‌

పార్వతీపురం: జిల్లాలో ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆస్పత్రి సివిల్‌ పనులను గడువులోగా పూర్తి చేయా లని కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం తన కార్యాల యం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పనుల పురోగతిని సమీక్షిస్తూ, సమగ్ర ప్రెజింటేషన్‌ ఇవ్వాలని సూచించారు. విద్యుత్‌ సౌకర్యం, జనరేటర్లు, ప్రహరీల పనులపై దృష్టి సారించి, నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ పెంచాలని, సమన్వయం మెరుగుపరచాలని ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంగణాల పరిశుభ్రత, సుందరీకరణపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పార్వతీపురం, పాలకొండ, ఐటీడీఏ పీఓలు ఆర్‌.వైశాలి, పవర్‌ స్వప్నిల్‌, డీసీహెచ్‌ఎస్‌ జి.నాగభూషణరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

జనగణనకు సహకరించాలి

జిల్లాలో మే 1 నుంచి ప్రారంభమైన ఇంటింటికి జనగణన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకరరెడ్డి కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ మే 30 వరకు ఎన్యూమరేటర్లు ప్రతీ ఇంటిని సందర్శించి గృహాల స్థితిగతులు, వసతులు, కుటుంబ వివరాలను సేకరిస్తారని పేర్కొన్నారు. ఇచ్చే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని, సంక్షేమ పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా నిజమైన వివరాలు అందించి గణన విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement