చివరి ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

చివరి ప్రయాణం

May 2 2026 8:20 AM | Updated on May 2 2026 8:20 AM

చివరి ప్రయాణం

పాలకొండ రూరల్‌: ఒకే గ్రామానికి చెందిన నలుగురి ఆఖరి ప్రయాణం గ్రామస్తులను విషాదంలో ముంచేసింది. ఆ నలుగురి మృతదేహాలకు ఒకే చోట దహన సంస్కారాలు జరుగుతుంటే గ్రామస్తుల కన్నీరు ఆగలేదు. పాలకొండ మండలానికి చెందిన పలువురు గిరిజనులు గురువారం సీతంపేట మండలం పుబ్బాడలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా మీనకోట మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జంపరకోటకు చెందిన ఆరిక లక్ష్మి (55), కొండగొర్రి శ్రావణి (25), ఉర్లక శాంతి (30)తో పాటు ఆటో డ్రైవర్‌ అక్కుపల్లి రమణ (36) మృతి చెందిన విషయం విదితమే. ఈ క్రమంలో వారి మృతదేహాలకు శుక్రవారం పాలకొండ ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.చిరంజీవి పర్యవేక్షణలో పోస్టుమార్టం చేపట్టారు. అప్పటికే మృతుల బంధువులు, వారి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసుల పంచనామా అనంతరం అధికారిక చర్యలు పూరికావడంతో మధ్యాహ్నం 12 గంటలకు మృతదేహాలను మహిళల స్వగ్రామం జంపరకోటకు, ఆటో డ్రైవర్‌ మృతదేహం ఆయన గ్రామమైన డోలమడకు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. మృతదేహాలు గ్రామాలకు చేరడంతో ఒక్కసారిగా ఆయా పల్లెల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, గ్రామస్తులు, సన్నిహితుల రోదనలు మిన్నంటాయి. డోలమడలో ఆటో డ్రైవర్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. జంపరకోటలలో మృతిచెందిన ముగ్గురు మహిళలతో పాటు అదే గ్రామానికి చెందిన జీలకర్ర మోహనరావు(60) శుక్రవారం సీతంపేట మండలం వాబ వద్ద బైక్‌పై భార్యతో వస్తుండగా బస్సు ఢీకొనడంతో ఘటనా స్థలంలో మరణించాడు. మోహనరావు మృతదేహానికి సీతంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం పోస్టుమార్టం పూర్తి చేశాక మృతదేహం అదే సమయానికి గ్రామానికి చేరింది. దీంతో నలుగురి మృతదేహాలకు ఒకే చోట దహనసంస్కారాలు చేపట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు రోడ్డు ప్రమాద ఘటనల్లో ఒకే గ్రామానికి చెందిన నలుగురు మరణించటంతో వారి కుటుంబసభ్యుల రోదనలను అదుపుచేయడం ఎవరి తరమూ కాలేదు. ప్రయాణం మిగిల్చిన విషాదాన్ని తలుచుకుంటూ గిరిజనులు తల్లడిల్లిపోయారు.

కోలుకుంటున్న క్షతగాత్రులు

ఇదిలా ఉండగా ఆటో ప్రమాదంలో గాయాలపాలై శ్రీకాకుళంలో వైద్య సేవలు పొందుతున్న కొండగొర్రి మౌనిక, ఎనిమిదేళ్ల నిమ్మక చాందినితోపాటు మృతురాలు శ్రావణి పిల్లలు హేమ, రిషికుమార్‌తోపాటు గాయపడిన కె.మల్లమ్మ, కె.పద్మలత తదితరులు కోలుకుంటున్నారు.

జంపరకోటకు చేరిన మృతదేహాలు

ఒకే చోట నలుగురి దహన సంస్కారాలు

డోలమడలో ఆటో డ్రైవర్‌ రమణ

అంత్యక్రియలు

కన్నీటి పర్యంతమైన రెండు గ్రామాల ప్రజలు

Advertisement
 
Advertisement
Advertisement