● నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు ● మామిడి, బొప్పాయి, అరటి పంట్లకు తీవ్ర నష్టం ● విద్యుత్ అంతరాయంతో ఇక్కట్లు
జియ్యమ్మవలస రూరల్: పెదకుదమలో నేలవాలిన అరటి తోటలో రైతు నవీన్ కుమార్
పాలకొండరూరల్/వీరఘట్టం/గరుగుబిల్లి/కొమరాడ/జియ్యమ్మవలస రూరల్: పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టం, పాలకొండ, కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస, తదితర మండలాల్లో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. మామిడి, బొప్పాయి, అరటి పంటలకు తీవ్ర నష్టంవాటిల్లింది. మొక్కజొన్న నేలమట్టమైంది. 60–80 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు జనం భయపడ్డారు. ఇళ్లలోకి పరుగులు తీశారు. ఈదురుగాలులతో కూడిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
●వీరఘట్టం మండలంలో సుమారు 2వేల ఎకరా ల్లో కోతదశలో ఉన్న మామిడి పంట నేలమట్టమయ్యింది. 10 ఎకరాల్లో బొప్పాయి, అరటి తోట లు నేలమట్టమయ్యాయని రైతులు చెబుతున్నారు.
●గరుగుబిల్లి మండలంలోని గిజబ, తోటపల్లి పంచాయతీ పరిధిలోని నందివానివలస గ్రామాల రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది.
●కొమరాడ మండలంలో పార్వతీపురం నుంచి రాయగడ వెళ్లే అంతర రాష్ట్ర రహదారిపై కూనేరు రామభద్రపురం సమీపంలో భారీ వృక్షం నెలకొరింది. చెట్టును యుద్ధ ప్రాతిపదికన తొలగించి రాకపోకలను పోలీసుల క్రమబద్ధీకరించారు.
●జియ్యమ్మవలస మండలంలోని కుదమ, గౌరీపురం, పరజపాడు, పెద్దకుదమ, సింగనాపురం, గంగరాజుపురం, తదితర గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో చేతికందిన అరటి పంట నేలమట్టమైంది. లక్షల రూపాయలు పెట్టుబడి నేలపాలైందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
●పాలకొండ మండలంలో ఎం.సింగుపురం సీహెచ్‌సీ ఎదరుగా 9 విద్యుత్ స్తంభాలు, అన్నవరం, బెజ్జి, పొట్లి, సింగన్నవలస తదితర గ్రామాల్లో 4, పట్టణంలో మున్సిపాల్ కార్యాలయం, యాలం కూడలి, విద్యుత్ సబ్ స్టేషన్ వతదితర ప్రాంతాల్లో 5 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాన్స్‌కో డీఈ కె.విష్ణుమూర్తి, ఏఈ యోగి నేతృత్వంలో సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.


