కొమరాడ: జిల్లాలో మలేరియా నియంత్రణే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి ఎస్.భాస్కరరావు తెలిపారు. గిరిశిఖర గ్రామాలైన బిన్నిడి, డి. గుణదలో మలేరియా నివారణ మందును శుక్రవారం పిచికారీ చేయించారు. ఎన్‌సీడీ పీఓ డాక్టర్ టి.జగన్‌మోహనరావుతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఐఆర్‌ఎస్ నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. అన్నిగదుల్లో స్ప్రేయింగ్ తప్పనిసరిగా చేయాలని సిబ్బందికి సూచించారు. దోమతెరల వినియోగంపై అవగాహన కల్పించారు. అక్కడ విద్యార్థులు, పిల్లలకు వేసవి ఆరోగ్య జాగ్రత్తలపై సూచనలు చేశారు. జిల్లాలో 1032 మలేరియా ప్రభావిత గ్రామాల్లో ఐఆర్‌ఎస్ మొదటి విడత పిచికారీ జూన్ 15 వరకు వరకు కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో డీఎంఓ సూర్యనారాయణ, మాదలింగి పీహెచ్‌సీ వైద్యాదికారి ఎస్.తనూజ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


