శ్రద్ధగా రాశారు.. | - | Sakshi
Sakshi News home page

శ్రద్ధగా రాశారు..

May 1 2026 6:09 AM | Updated on May 1 2026 6:09 AM

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2026

పదో తరగతి ఫలితాల్లో మన్యం విజయదుందుభి

వరుసగా నాలుగోసారి రాష్ట్రంలో ‘టాప్‌’

96.07 శాతం ఉత్తీర్ణత నమోదు

బాలికలదే పైచేయి..

సాక్షి, పార్వతీపురం మన్యం

దో తరగతి ఫలితాల్లో మన్యం బిడ్డలు మరోసారి అదరగొట్టారు. జైత్రయాత్రను కొనసాగించారు. తమకు ఎదురే లేదని నిరూపించారు. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. తమ ర్యాంకును మెరుగుపరుచుకుంటూ.. ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా నాలుగోసారి సింహాసనం మీద సగర్వంగా కూర్చొన్నారు. ఏపీ పదో తరగతి ఫలితాలు గురువారం ఉదయం విడుదల కాగా.. 96.07 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే జిల్లా అగ్రగామిగా నిలిచింది. గిరిజన ప్రాంతమైనప్పటికీ.. విద్యా రంగంలో మన్యం స్థిరమైన ప్రతిభ చూపుతుండటం విశేషం.

మరోసారి సత్తా చాటిన బాలికలు

ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ఫలితాలు రాబట్టారు. 590కి పైగా పలువురు మార్కులు సాధించడం విశేషం. పదో తరగతిలో 10,506 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో బాలురు 5,109 మంది కాగా.. బాలికలు 5,397 మంది ఉన్నారు. మొత్తంగా 10,092 మంది ఉత్తీర్ణత సాధించారు. 96.54 శాతంతో జిల్లాలో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు.

● ఫలితాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విద్యార్థులు ప్రతిభ చూపారు. జిల్లాలో ఉన్న మొత్తం తొమ్మిది ప్రీ మెట్రిక్‌ వసతిగృహాల్లో 82 మంది పరీక్షలు రాశారు. ఇందులో 79 మంది ఉత్తీర్ణత సాధించారు. 75 మంది ప్రథమ శ్రేణి, నలుగురు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఏడు వసతిగృహాల్లో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. 500 మార్కులు కంటే ఎక్కువ వచ్చిన వారు 33 మంది ఉన్నారని జిల్లా వెనుకబడిన సంక్షేమ, సాధికారక అధికారి ఇ.అప్పన్న తెలిపారు. సారిపల్లి నవనీత్‌కుమార్‌ 578/600(బూర్జ), దాసరి దీనిష్‌కుమార్‌ 578(గరుగుబిల్లి), రెడ్డి స్వాతి 576(పార్వతీపురం),అలుగూలు మధు 568 (జియ్యమ్మవలస) మార్కులు సాధించారు.

● పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని 40 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 98.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 1,810 మంది పరీక్షలు రాయగా.. 1,788 మంది ఉత్తీర్ణత సాధించారు. భద్రగిరి పాఠశాలకు చెందిన ఆకుల వసంత 581 మార్కులతో టాపర్‌గా నిలిచింది. ఆరు గురుకులాల్లో 99.03 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 414 మంది పరీక్షకు హాజరు కాగా.. 404 మంది ఉత్తీర్ణులయ్యారు. బిడ్డిక భవానీ 588 మార్కులతో టాపర్‌గా నిలిచినట్లు డీడీ విజయశాంతి తెలిపారు.

అభినందనల వెల్లువ

పదో తరగతి ఫలితాల్లో వరుసగా నాలుగోసారి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించడం పట్ల విద్యార్థులకు కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో తొలి స్థానంలో నిలవడం ఆనందంగా, గర్వకారణంగా ఉందన్నారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, అధికారుల సమన్వయంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని చెప్పారు.

మంచి మార్కులకు ‘సాక్షి’ దోహదం

నేను పదో తరగతి ఫలితాల్లో 591 మార్కులు సాధించడానికి సాక్షి స్టడీ మెటీరియల్‌ ఎంతో దోహదపడింది. సాక్షి అందజేసిన మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ స్టడీ మెటీరియల్‌ బాగా ఉపయోగపడ్డాయి. ఈ మెటీరియల్‌లో ఉన్న ముఖ్యమైన విషయాలను ఉపాధ్యాయులు తరచూ బోధించడంతో గణితంలో 100, సైన్స్‌లో 98 మార్కులు సాధించగలిగాను. సాక్షి మీడియాకు ధన్యవాదాలు.

– బౌరోతు తరణి, తలవరం హైస్కూల్‌, వీరఘట్టం

Advertisement
 
Advertisement
Advertisement