కిశోరి వికాసం కార్యక్రమానికి శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

కిశోరి వికాసం కార్యక్రమానికి శ్రీకారం

May 1 2026 6:09 AM | Updated on May 1 2026 6:09 AM

పార్వతీపురం: బాలికల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా జిల్లాలో కిశోరి వికాసం కార్యక్రమానికి కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకరరెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మే 1 నుంచి జూన్‌ 11 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వేసవి శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరాల్లో బాలికలకు విద్య, ప్రాముఖ్యత, ఆరోగ్యం – పోషకాహారం, రుతు పరిశుభ్రత, లైంగిక – పునరుత్పత్తి, ఆరోగ్యం, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధం, మత్తు పదార్ధాల నివారణ, కెరీర్‌ మార్గదర్శకత్వం, సైబర్‌ భధ్రత, ఆర్థిక నిర్వహణ, తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. బాలికల్లో ఆత్మ విశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించే కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కిశోరి వికాసం పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ టి.కనకదుర్గ తదితరులు ఉన్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

సీతంపేట: మండలంలోని వాబ జంక్షన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం పాలకొండ మండలం జంపరకోటకు చెందిన జీలకర్ర మోహన్‌రావు (60) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంపై ఎస్సై వై.అమ్మన్నరావు అందించిన వివరాల ప్రకారం రాయికురిడి గ్రామంలో జరిగే గ్రామపండగకు వెళ్లి భార్య వరలక్ష్మితో కలిసి ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణంలో వస్తున్నాడు. వాబ జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి ఎదురుగా ఆర్‌టీసీ బస్సు వస్తోంది. ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొట్టడంతో కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య వరలక్ష్మికి తీవ్రగాయలయ్యాయి. వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరళించారు. ఆమె పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరళించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

నేటి నుంచి జనగణన

ఇంటింటి గణనకు ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం

సాక్షి, పార్వతీపురం మన్యం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి జనగణన ప్రక్రియను జిల్లాలో మే 1వ తేదీ నుంచి 30 రోజుల పాటు చేపట్టనున్నారు. ఇది వరకే ప్రారంభించిన స్వీయ గణన(సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌) ప్రక్రియలో 15 శాతం పూర్తి చేసి, రాష్ట్రంలో మన్యం జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్‌ 16 నుంచి 30 మధ్య స్వీయగణన చేపట్టారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటింటి జనగణనను 20వ తేదీలోగా పూర్తి చేసేలా క్షేత్ర స్థాయి సిబ్బంది పని చేయాలని అధికారులు స్పష్టం చేశారు. జనగణన కోసం ప్రత్యేకంగా ఫీల్డ్‌ అధికారులను, ఎన్యూమరేటర్లను నియమించారు. సగటున 800 జనాభాను ఒక యూనిట్‌గా పరిగణిస్తున్నారు. లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఏ ఒక్కరికీ సెలవులు ఇవ్వరాదని నిర్ణయించారు. తప్పులు చేసే ఉద్యోగులపై జనగణన చట్టం 11 ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలోని 15 మండలాలు, మూడు మున్సిపాలిటీల్లో 1,744 ఎన్యూమరేటర్లు, 302 మంది సూపర్‌వైజర్లతో ఇంటింటి జనగణన ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వచ్చి వివరాలు సేకరిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాబా 9.25 లక్షలు. చాలా ఏళ్ల తర్వాత గణన చేపడుతున్నారు. ప్రజలు కచ్చితమైన సమాచారం ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పథకాల రూపకల్పనకు సహకరించాలని అధికారులు కోరారు.

ఫిర్యాదులకు కంట్రోల్‌ రూం ఏర్పాటు..

ప్రజల సౌకర్యార్థం, ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా, డివిజన్‌, చార్జి అధికారి స్థాయిల్లో కంట్రోల్‌రూంలను, రాష్ట్ర స్థాయిలో టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు. జిల్లా కంట్రోల్‌ రూం 08963–796085 నంబరుకు ఎవరైనా సంప్రదించవచ్చు.

పింఛన్ల పంపిణీ ఎలా?

జనాభా లెక్కల కోసం నియమించిన ఎన్యుమరేటర్లలో దాదాపు 80 శాతం మంది వరకు సచివాలయ సిబ్బందే ఉన్నారు. ప్రస్తుతం మే నెలకు సంబంధించి ఒకటో తేదీ నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టాల్సి ఉంటుంది. శుక్ర, శనివారాల్లో పింఛన్లు అందజేయాల్సి ఉండగా.. ఇదే సమయంలో గణన విధులకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రభావం దేనిపైన పడుతుందోనని సచివాలయ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement