పార్వతీపురం: జిల్లాలో జరుగుతున్న జలధార – జలహారతి పనుల్లో ఎలాంటి వెనుకబాటు ఉండకూడదని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని ఆయన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని, సోక్‌పిట్స్ నిర్మాణం, చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చెరువులు, కాలువల ఆక్రమణలను వెంటనే తొలగించి హద్దులను నిర్ధారించాలన్నారు. ప్రతీ గ్రామంలో పనుల పురోగతిపై చెక్‌లిస్టు సిద్ధం చేసి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ పెంచాలని, నాణ్యతలో రాజీ పడకుండా పనులు పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మే 10వ తేదీలోగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమీక్షలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


