
వైఎస్సార్‌సీపీ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం
సాలూరు రూరల్: వైఎస్సార్‌సీపీ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమ పాలన ప్రజలకు అందిందని, కూటమి ప్రభుత్వం అబద్ధాలతో కాలం గడుపుతోందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరు మండలం మావుడి గ్రామంలో గురువారం నిర్వహించిన బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ మోసపూరిత పాలనను వివరించారు. టీడీపీ ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడం వల్ల ఎంత నష్టపోయారన్నది తెలియజేశారు. ఉచిత బస్సు సదుపాయాన్ని ఎప్పుడు కల్పిస్తారో స్పష్టతలేదన్నారు. తొలుత రాష్ట్రం అంతటా అనిచెప్పి ఇప్పుడు జిల్లాకే పరిమితం అంటున్నారంటూ విమర్శించారు. సాలూరు నియోజకవర్గ ప్రజలు కనీసం 10 కిలోమీటర్లు కూడా ఉచిత ప్రయాణం సాగించలేరని, ఎందుకంటే సాలూరు పట్టణం దాటిన వెంటనే విజయనగరం జిల్లా ఉంటుందని, అక్కడ టిక్కెట్ తీయాల్సి వస్తుందన్నారు. సాలూరు నియోజకవర్గంలో టీడీపీ హయాంలో వేసిన ఒక రోడ్డు, నిర్మించిన ఒక బ్రిడ్జిపేరును మంత్రి సంధ్యారాణి చెప్పాలన్నారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబునాయుడు బాటలోనే మంత్రి నడుస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో గిరిజనులకు పూర్తిగా ఉచిత విద్యుత్ అందిస్తే కూటమి ప్రభు త్వంలో విద్యుత్ చార్జీలు పెంచి పేదల డబ్బుతో సంపద సృష్టిస్తున్న ఘనత చంద్రబాబునాయుడికే దక్కుతుందన్నారు. మహిళలకు గ్యాస్ ఉచితంగా ఇస్తామని చెప్పిన చంద్రబాబు మాటలు అంతా గ్యాస్ అని తేలిపోయిందన్న విషయం ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయిందన్నారు. పొదుపు సంఘాల మహిళల రుణాలను మాఫీ చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు భరత్‌శ్రీనివాస్, జిల్లా నాయకులు దండి శ్రీనివాసరావు, మావుడి సర్పంచ్ సుధ, తోణాం సర్పంచ్ మువ్వల ఆదియ్య, శివరాంపురం ఎంపీటీసీ సభ్యుడు కళ్లేపల్లి త్రినాథ, వైఎస్సార్‌సీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీడీపీ నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలే..
బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర