
అక్కరకు రాని జీసీపీఎస్..!
● బాలికలకు 20 ఏళ్లు నిండినా అందని డబ్బులు
● వేలాది మంది ఎదురుచూపులు
● ఇద్దరు ఆడపిల్లలు అయితే రూ.60వేలు ఇవ్వాలి
● ఒక ఆడపిల్ల అయితే రూ.లక్ష అందాలి
● గడువు దాటినా డబ్బులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్న లబ్ధిదారులు
విజయనగరం ఫోర్ట్: ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలిక పేరు జాగరపు వైదేహి. 2002లో జన్మించింది. ఈమెది విజయనగరంలోని బొబ్బాది పేట ప్రాంతం. ఆదిలక్ష్మి, స్వామినాయుడుల ఏకై క సంతానం. ఒక ఆడపిల్లతో వీరు కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స చేసుకున్నారు. బాలికా సంరక్షణ పథకం (జీసీపీఎస్) పథకం కోసం దరఖాస్తు చేయగా వారికి పథకానికి సంబంఽధించిన బాండు కూడా ఇచ్చారు. 20 ఏళ్లు నిండిన తర్వాత ఈమెకు రూ.లక్ష అందాలి. ప్రస్తుతం ఈమెకు 23 ఏళ్లు వచ్చాయి. అయినా డబ్బులు అందలేదు. ఐసీడీఎస్ అధికారులను అడిగినా స్పష్టమైన సమాధానం చెప్పడం లేదని వైదేహి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఈమె ఒక్కరే కాదు. అనేక మంది జీసీపీఎస్ ద్వారా ఇచ్చే ప్రోత్సాహకం కోసం జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఎదురుచూస్తున్నారు. కొంతమందికి వివాహాలు కూడా జరిగిపోయాయి. ఇంకొంతమంది ఆ డబ్బులు వస్తే వివాహం చేయాలని చూస్తున్నారు. ఈ పథకం కోసం పేదవర్గాలకు చెందిన వారే అధికశాతం మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పడు వారంతా పథకం లబ్ధికోసం నిరీక్షిస్తున్నారు. ఆడపిల్లలను కన్నవారిని ప్రోత్సహించడం కోసం బాలికా సంరక్షణ పథకాన్ని అప్పట్లో ప్రవేశ పెట్టారు. ఒక ఆడపిల్ల అయితే రూ.లక్ష, ఇద్దరు ఆడపిల్లలైతే రూ.60 వేలు (ఒక్కో ఆడపిల్లకు రూ.30 వేలు చొప్పన) బాలికకు 20 ఏళ్లు నిండిన తర్వాత అందివ్వాలన్నది పథకం ఉద్దేశ్యం.
వేలాది మంది ఎదురుచూపులు:
బాలికా సంరక్షణ పథకం నిబంధనల ప్రకారం జిల్లాలో చాలా మంది బాలికలకు 20 ఏళ్లు నిండాయి. వారందరికీ ప్రభుత్వం డబ్బులు అందజేయాలి. 20 ఏళ్లు నిండిన అమ్మాయిల తల్లిదండ్రులు సీడీపీఓ, పీడీ కార్యాలయాల్లో డబ్బుల గురించి అడిగినా అక్కడి అధికారులు స్పష్టత ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 42,980 మంది జీసీపీఎస్ పథకానికి అర్హులున్నారు. వారిలో చాలా మందికి 20 ఏళ్లు నిండాయి. ఒక ఆడపిల్లకు రూ.లక్ష వస్తుందని తల్లిదండ్రులు గంపెడాశలు పెట్టుకున్నారు. పేదవారైతే వివాహ ఖర్చులకు సరిపోతాయిని అశించారు.
ప్రభుత్వం నోటీసులో ఉంది
బాలికా సంరక్షణ పథకానికి సంబంధించి 20 ఏళ్లు దాటిన వారికి డబ్బుల చెల్లింపు విషయం ప్రభుత్వం నోటీసులో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు ఈ పథకం అమలైంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై చర్చిస్తున్నాయి. డబ్బుల చెల్లింపునకు సంబంధించి కొంత సమయం లబ్ధిదారులు వేచి ఉండాలి.
తవిటినాయుడు, ఇన్‌చార్జి, పీడీ, ఐసీడీఎస్
పథకానికి అర్హతలు:
జీసీపీఎస్ (బాలికా సంరక్షణ పథకం) ఒకరు, లేదా ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వారు అర్హులు.
కుటుంబం మొత్తం వార్షిక ఆదాయం రూ.90 వేల లోపు ఉన్నవారు
ఒక ఆడపిల్ల అయితే రూ.లక్ష అందజేస్తారు.
ఇద్దరు ఆడపిల్లలైతే రూ. 60 వేలు ఇస్తారు.

అక్కరకు రాని జీసీపీఎస్..!