
ఉపాధి వేతనదారు మృతి
పాలకొండ రూరల్: మండలంలోని వెలగవాడ పంచాయతీ సిరికొండ గిరిజన గ్రామంలో ఉపాధి పనులకు హాజరైన పాలక సరోజిని(54) అకస్మాత్తుగా మృతిచెందింది. గ్రామంలోని ఊరచెరువులో ఉపాఽధి పనులకు కుమారుడు నారాయణరావుతో కలసి సోమవారం ఆమె వెళ్లింది. మస్తర్లు వేయించిన తరువాత యథావిధిగా వేతనదారులు పనులకు ఉపక్రమించారు. ఈ క్రమంలో సరోజిని అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంది. విషయం గమనించిన సహచర వేతనదారులు, బాధితురాలిని కుమారుడితో పాటు ఇంటికి తరలించి, 108కు సమాచారం అందించారు. వాహనం చేరుకుని సిబ్బంది పరీక్షించి సరోజిని మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ ఎం.విజయరంగారావు, ఉపాఽధి ఏపీఓ ఈశ్వరమ్మ, క్షేత్ర సహాయకుడు బుల్లిబాబు మృతురాలి ఇంటికి వెళ్లి ఘటనపై ఆమె కుమారుడిని అడిగి తెలుసుకున్నారు, ఆ సమాచారం డ్వామా పీడీకి వివరించారు. మృతురాలికి భర్త పెంటయ్య ఉన్నాడు. గ్రామస్తులతో కలిసి పనులు చేస్తూ మృత్యువాత పడడంతో సహచర వేతనదారులు, గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు.