
ఆరు వారాల్లో చెక్ డ్యామ్‌ల పనులు పూర్తికావాలి
పార్వతీపురం టౌన్: జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న చెక్ డ్యామ్‌లు, క్యాస్కేడింగ్స్, చెరువుల పనులు ఆరు వారాల్లో పూర్తికావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన తన చాంబర్‌లో జిల్లాలో చేపట్టిన జల వనరుల పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 39 చెక్‌డ్యామ్‌లు, 122 చెరువులు, 40 క్యాస్కేడింగ్స్ పనులను చేపట్టేందుకు మంజూరు ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు. త్వరలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఈలోగా పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. మంజూరుచేసిన పనులన్నీ ఆరు వారాల గడువులోగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి త్వరగా పనులను ప్రారంభించాలన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఉపాధి హామీలో జిల్లాకు కేటాయించిన రూ. 210 కోట్ల నిధుల్లో ప్రప్రథమంగా జల వనరుల పనులకే తొలి ప్రాధాన్యం ఇచ్చామని, తద్వారా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల్లో ఒక్క పని కూడా ప్రారంభం కాలేదని, దీనిపై ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎంత త్వరగా పనులు పూర్తిచేస్తే అంత త్వరగా నిధులు విడుదలవుతాయని, కావున ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకుడు కె.రామచంద్రరావు, జల వనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ ఆర్.అప్పల నాయుడు, సహాయ ఇంజినీర్లు, జూనియర్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్