
రేషన్‌కార్డు విభజనకు చిన్నారుల అవస్థలు
పార్వతీపురం: ఉమ్మడి కుటుంబంలో ఉన్న తమకు రెండు రేషన్ కార్డులుగా విభజించి మంజూరు చేయాలని ఫొటోలో ఉన్న చిన్నారులు తమ నాయనమ్మతో కలిసి సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. గరుగుబిల్లి మండలం పెదగుడబ గ్రామానికి చెందిన సిరిపోల ఇలవేణి పెద్ద కుమారుడు భానుప్రసాద్ భార్య, వారి పిల్లలు, చిన్నకుమారుడు కలిసి ఒక కార్డులో ఉన్నారు. భాను ప్రసాద్‌కు వివాహమై ఐదు సంవత్సరాలు కావస్తోంది. పెద్దకుమారుడు భాను ప్రసాద్ వారి కుటుంబ సభ్యుల పేరున కార్డును మంజూరు చేయాలని ఎస్‌ఆర్‌పేట పంచాయతీ అధికారుల వద్దకు మూడు, నాలుగు సార్లు వెళ్లినప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ సర్వర్ పనిచేయడం లేదని బదులివ్వడంతో తమకు రేషన్‌కార్డు విభజన నిమిత్తం ఏమీ చేయలేని పరిస్థితుల్లో తల్లి ఇలవేణి, తన ముగ్గురు పిల్లలతో కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్‌కు సమస్యను విన్నవించారు. విభజన కాని కారణంగా తన తల్లి వితంతు పింఛన్‌కూడా మంజూరు చేయడం లేదని భాను ప్రసాద్ సాక్షికి తెలిపారు.