
గంజాయి పీలుస్తున్న వ్యక్తి అరెస్ట్
నెల్లిమర్ల: గంజాయి పీలుస్తూ పట్టుబడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై బి.గణేష్. తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ నారాయణపట్నం బ్రిడ్జి దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ ప్రాంతంలో ఒక వ్యక్తి అక్రమంగా గంజాయి కలిగి ఉండి పీలుస్తున్నాడన్న సమాచారంపై సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. అలాగే జరజాపు పేటకు చెందిన యశ్వంత్ అనే వ్యక్తి వద్ద 100 గ్రాముల గంజాయి, గంజాయి పీల్చడానికి ఉపయోగించే పరికరాలను సీజ్ చేసి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. నిందితుడు గడిచిన ఆరేడు సంవత్సరాల నుంచి గంజాయి వినియోగిస్తున్నాడని, ఒడిశా రాష్ట్రంలోని రాయగడ రైల్వేస్టేషన్ ప్రాంతంలో కొనుక్కుని ఇక్కడికి తీసుకొని వచ్చి వినియోగిస్తున్నట్లు విచారణలో చెప్పినట్లు తెలిపారు. మండలంలో ఎవరైనా గంజాయి వినియోగించినా.. గంజాయి కలిగి ఉన్నా, ఏ రూపంలో అయినా గంజాయికి సంబంధించి కార్యక్రమాల్లో పాలుపంచుకున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై గణేష్ హెచ్చరించారు. గంజాయి గురించి సమాచారాన్ని ఫోన్ 912110944 నంబర్‌కు తెలియజేయాలని కోరారు. దాడుల్లో సిబ్బంది దామోదర్ రావు, వీఆర్వో వెంకటలక్ష్మి, మహిళా పోలీస్ పాల్గొన్నారు.