
స్వచ్ఛ పార్వతీపురం మనందరి బాధ్యత
పార్వతీపురంటౌన్: స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ పార్వతీపురం మనందరి బాధ్యతని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ నారాయణ భరత్‌గుప్తా, కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. కలెక్టర్‌తో కలిసి కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం మొక్కలు నాటారు. పురపాలక సంఘం ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగను పంపిణీ చేశారు. బీట్ ది హీట్ నివాదంతో తాగునీటి సదుపాయాలు కల్పించాలని, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు. ప్రతీ కుటుంబం మరుగుదొడ్డిని నిర్మించుకోవాలన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక, డీఆర్వో కె.హేమలత, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి సీహెచ్ రాధాకృష్ణమూర్తి, పలు విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.
పద్మ అవార్డులకు
దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురంటౌన్: ప్రతిష్టాత్మక పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. భారత హోం మంత్రిత్వశాఖ ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు (పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ)లను ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి పద్మ అవార్డులకు ఎంపిక చేస్తుందన్నారు. జిల్లాల్లో ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన యువత, వ్యక్తులు తగిన వివరాలతో దరఖాస్తులు సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు. దరఖాస్తు, నియమ నిబంధనలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పద్మ అవార్డ్స్.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో పరిశీలించ వచ్చని ఆయన అన్నారు. యువజన సర్వీసుల శాఖ సెట్విజ్, విజయనగరం కార్యాలయానికి రెండు సెట్లులో దరఖాస్తు సమర్పించాలని ఆయన సూచించారు. వివరాలకు సెల్: 98499 09080, 984990 13080 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.
ఉపాధి నిధులతో
మౌలిక వసతులు
● జిల్లా ప్రత్యేక అధికారి డా.నారాయణ భరత్ గుప్తా
పార్వతీపురం రూరల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆదేశించారు. పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్‌తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలకు కావాల్సిన రోడ్లు, కాలువలు, చెరువుల్లో పూడికతీత పనులు, వ్యవసాయ భూమి చదును పనులు, ఇంకుడు గుంతలు, ఫారంపాండ్లు, నీటికుంటల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలకు సంబంఽధించిన పనులను ఉపాధిహామీ నిధులతో చేపట్టాలన్నారు. వీటివల్ల గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజల జీవనోపాధి మెరుగవుతుందన్నారు. అనంతరం వేతనదారుల కోసం ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సందర్శించి మజ్జిగను పంపిణీ చేశారు. వైద్యశిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకుడు కె.రామచంద్రరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆండ్ర జలాశయం నీరు విడుదల
విజయనగరం: నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశాల మేరకు నీటిపారుదలశాఖ అధికారులు శనివారం ఆండ్ర జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. మరి కొద్దిరోజుల్లో మెంటాడ, పిట్టాడా, గజపతినగరం, రామతీర్థం మూల స్టేషన్ మీదుగా నెల్లిమర్లలోని చంపావతి నదిలోకి నీరు చేరనుంది. అక్కడ నుంచి ఇన్‌ఫిల్టరేషన్ ద్వారా నగరంలోని రిజర్వాయర్లకు పంపింగ్ చేస్తారు. ప్రస్తుతం చంపావతి నీటి మట్టం తగ్గిపోవడంతో నగర ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చూసేందుకు విజయనగరం కార్పొరేషన్ చర్యలు చేపడుతోంది.