
రాష్ట్రంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకే రక్షణ కరువు
సాలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేస్తూ కక్షపూరిత పాలన సాగిస్తోందని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో విలేరులతో శనివారం మాట్లాడారు. లిక్కర్‌స్కాం అంటూ రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డిను అక్రమంగా అరెస్టు చేసిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి వ్యక్తులను అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపుతున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. ఉన్నత అధికారులుగా పనిచేసిన వ్యక్తులకే రక్షణ కరువైందని, సాధారణ అధికారులు, ప్రజలు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పార్వతీపురం మహిళా తహసీల్దార్‌పై అసభ్య పదజాలంతో దూషించడం అమానుషమన్నారు. 2014–2019 మధ్య టీడీపీ పాలనలో తహసీల్దార్లు వనజాక్షి, నారాయణమ్మలపై టీడీపీ నేతలు దాడులు చేసినా కేసులు లేవని పేర్కొన్నారు. సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ పట్ల మూడు రోజుల కిందట సాలూరు పట్టణాధ్యక్షుడు దురుసుగా మాట్లాడిన ఘటనను గుర్తుచేశారు. టీడీపీ నేతలకు మహిళలంటే చిన్నచూపని విమర్శించారు.
టీడీపీ పాలనలో తను కూడా ఉద్యోగిగా బాధితుడునేనని, అందుకే ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చినట్టు వివరించారు. ఉద్యోగులను గౌరవించాలే తప్ప వేధించడం తగదన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, ఎప్పుడూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండదన్న విషయం గుర్తించుకోవాలని తెలిపారు. అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని కోరారు.
లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగంలో కక్షపూరితంగా అక్రమ అరెస్టులు
అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదన్నది గుర్తురెగాలి
టీడీపీ నేతలకు మహిళలంటే చిన్నచూపు
మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర