
మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలి: కాంగ్రెస్
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మండల తహసీల్దార్ వై.జయలక్ష్మి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మధ్య రెండు రోజులుగా నెలకొన్న వివాదంపై దర్యాప్తు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గం ఇన్‌చార్జి బత్తిన మోహన్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సాలూరు ఇన్‌చార్జి గేదెల రామకృష్ణ, పార్వతీపురం మన్యం జిల్లా ఓబీసీ జిల్లా చైర్మన్ వంగల దాలినాయుడు, వైస్ చైర్మన్ వెన్నెల సురేష్, మండలాధ్యక్షుడు గౌరీ శంకరరావు, సాలూరు మండలాధ్యక్షుడు ఒంటి బుచ్చయ్య, మండల ఉపాధ్యక్షుడు మజ్జి పరమేశ్వరరావు, కె. రమణమూర్తి తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మండల మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న ఓ మహిళా తహసీల్దార్.. ఎమ్మెల్యే తనను బూతు పదాలతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు అనే లెటర్ సోషల్ మీడియాలో, పత్రికల్లో హల్‌చల్ చేసినా పోలీసులు ధ్రువీకరించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. దీన్ని బట్టి చూస్తే పార్వతీపురం నియోజకవర్గంలో ప్రజాస్వామ్య బద్ధంగా పాలన జరుగుతోందా...? లేక నియంత పాలన సాగుతోందా...? అనే అనుమానం కలుగుతోందన్నారు. మండల మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న మహిళా అధికారికే రక్షణలేని పక్షంలో సామాన్య ఉద్యోగులు, మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై చేసిన పోలీస్ ఫిర్యాదును నిరసిస్తూ, టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టడం అత్యంత విచారకరం, హాస్యాస్పదమన్నారు. రాత్రికి రాత్రి ఎమ్మెల్యే ప్రెస్ మీట్, టీడీపీ శ్రేణులు ఆందోళన ఇవన్నీ చూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు.