
శాంతిని కోరుతూ చండీయాగం
విజయనగరం టౌన్: భారత్ పాకిస్తాన్‌ల మధ్య తలెత్తిన వివాదం కారణంగా భారతీయ సైనికుల క్షేమం, దేశ శాంతిని కోరుతూ రైల్వేస్టేషన్ వద్దనున్న పైడితల్లి అమ్మవారి వనంగుడిలో శుక్రవారం వేదపండితులు శాస్త్రోక్తంగా చండీయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధర్వణ వేదపండితుడు సాయికిరణ్ శర్మ, యుజుర్వేద పండితుడు వెలువలపల్లి నరసింహమూర్తి మాట్లాడుతూ విశ్వశాంతికి, భారతదేశం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, యుద్ధంలో మన సైనికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని యజ్ఞయాగాదులను నిర్వహించామన్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని చండీయాగం చేపట్టామని తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు ప్రసిద్ధికెక్కారని, సుమారు 80 మంది దంపతులు యాగంలో పాల్గొనడం విశేషమన్నారు. యాగ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రాలను, తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ ప్రసాద్ పర్యవేక్షించారు.