
మూడు పెంకుటిళ్లు దగ్ధం
గరుగుబిల్లి: మండలంలోని చినగుడబలో మూడు పెంకుటిళ్లు శుక్రవారం దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన ముదిలి కళావతి, ముదిలి మోహన్‌రావు, ముడిలి భాస్కరరావులకు చెందిన పెంకుటిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. కళావతి ఇంట్లో దీపం వెలిగించి ఉపాధిహామీ పనులకు వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన విషయాన్ని తెలుసుకున్న పార్వతీపురం అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో కళావతి కుటుంబం కట్టుబట్టలు మినహా గృహోపకరణాలు, నగదు, బీరువాలో ఉన్న బట్టలు విలువైన పత్రాలు, ధాన్యం అగ్నికి ఆహుతయ్యాయి. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉండడంతో ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రజలు ముందుకు రాలేదు. అయితే అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వెళ్లి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను తీసుకురాగా గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. మిగిలిన రెండు ఇళ్లలో పెద్దగా నష్టం జరగలేదు. ప్రమాద సమాచారం మేరకు ఘటనా స్థలానికి తహసీల్దార్ పి.బాల, ఆర్‌ఐ శ్రీనివాసరావు తదితరులు వచ్చి పరిశీలించి ఆస్తినష్టాన్ని అంచనా వేశారు. నష్టనివేదికలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ ప్రమాదంలో రూ.5లక్షలవరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపకశాఖాధికారి జి. ప్రభాకరరావు తెలిపారు.